DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో అక్టోబర్ 15న కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
DSC Notification: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.
DSC Notification
DSC Notification: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తామని గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఇప్పుడు 2026 సంవత్సరానికి సంబంధించిన డీఎస్సీ ప్రకటన విడుదలకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని యాజమాన్యాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను పూర్తిగా సేకరించి, ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అక్టోబర్ 15వ తేదీన అధికారికంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
పాఠశాల విద్యాశాఖలో 2 వేలకు పైగా ఖాళీలు
పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా రూపొందించిన జాబితా ప్రకారం.. రాష్ట్రంలోని పురపాలక, మండల, జిల్లా పరిషత్తులు, ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి సుమారు 2,250 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఈ ఖాళీల సంఖ్యపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. దీనికి అదనంగా గిరిజన గురుకులాలు, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, దివ్యాంగ, బీసీ సంక్షేమ విద్యా సంస్థల్లోని ఖాళీలను కూడా కలుపుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య 2,500కు పైగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డైట్, ఎస్‌సీఈఆర్టీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ
కేవలం స్కూల్ టీచర్ పోస్టులే కాకుండా, ఇతర విద్యా విభాగాకు చెందిన కీలక ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయనుంది. ఇందులో భాగంగా డైట్, ఎస్‌సీఈఆర్టీ లెక్చరర్ పోస్టులు 160 వరకు, జూనియర్ లెక్చరర్లు 209, అలాగే లైబ్రేరియన్ పోస్టులు వంద వరకు ఉండనున్నట్లు విద్యాశాఖ అంచనా వేసింది. ఈ నాన్-టీచింగ్, లెక్చరర్ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. దీనివల్ల అర్హత కలిగిన అనేక మంది అభ్యర్థులకు మంచి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
2029 వరకు ముందస్తు ప్రణాళిక, భర్తీ విధానం
ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రభుత్వం ముందుచూపుతో ప్రణాళికలు రచిస్తోంది. ప్రతి ఏటా డీఎస్సీ ఇవ్వాలన్న లక్ష్యంతో, 2029 వరకు ఏటా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల జాబితాను పాఠశాల విద్యాశాఖ తయారు చేసింది. మొత్తం ఖాళీల్లో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, మిగతా 30 శాతం పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసేలా రోడ్‌మ్యాప్ రూపొందించారు. 2026తో పాటు వచ్చే సంవత్సరాలకు సంబంధించిన ఖాళీల వివరాలు కూడా సిద్ధం చేస్తుండటంతో, అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ను మరింత ముమ్మరం చేయడం మంచిది.




