Ichchapuram: వెలుగు సిబ్బందికి మొబైల్స్ పంపిణీ.. ప్రారంభించిన ఎమ్మెల్యే

Ichchapuram: ఇచ్చాపురం నియోజకవర్గంలోని వెలుగు (సెర్ప్) సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 17 April 2026 4:50 PM IST
Ichchapuram
X

Ichchapuram: వెలుగు సిబ్బందికి మొబైల్స్ పంపిణీ.. ప్రారంభించిన ఎమ్మెల్యే

Ichchapuram: ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం, కంచిలి, కవిటి,సోంపేట మండలాల పరిధిలో వెలుగు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అనుబంధంగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న గ్రామ సంఘ సహాయకులు (విఓఏలు) కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జిల్లాలోనే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు చేపట్టిన ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ మొబైల్ ఫోన్లను సమర్థంగా వినియోగిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి మహిళా సంఘ సభ్యులకు వేగంగా చేరవేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలు, జీవనోపాధి ప్రణాళికల రూపకల్పనలో టెక్నాలజీ వినియోగంతో పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జనగణన కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించి, ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో సిబ్బంది ముందుండాలని అన్నారు.

పేదరిక నిర్మూలన దిశగా ‘పి4’ విధానాన్ని విజయవంతం చేయడంలో వెలుగు సిబ్బంది కీలక పాత్ర పోషించాలని, జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో సెర్ప్ విభాగానికి చెందిన ఏపీఎంలు ఎస్. ప్రసాదరావు, జి. అప్పలనరసమ్మ, కే. గోవింద్, సీసీలు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మొత్తం 185 మంది గ్రామ సంఘ సహాయకులు (విఓఏలు) పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా వెలుగు సిబ్బందికి టెక్నాలజీ పరంగా బలాన్నిస్తూ, పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story