Heavy Rain Alert : రెండు ద్రోణుల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు
Heavy Rain Alert : రెండు ద్రోణుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rain Alert
Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండల వేడి నుంచి పబ్లిక్‌కు ఉపశమనం లభించినా, ఇప్పుడు కుండపోత వర్షాల ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం రెండు శక్తివంతమైన ద్రోణులు వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇందులో మొదటిది ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. ఇక రెండోది అంతర్గత కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు యాక్టివ్‌గా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ డబుల్ ద్రోణుల ఎఫెక్ట్‌తో రాబోయే రెండు రోజులు ఏపీ, తెలంగాణ అంతటా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఏపీలో జిల్లాల వారీగా వానల అంచనా
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయి. అయితే అసలైన అలర్ట్ మాత్రం మంగళవారం నాడు ఉందని అధికారులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా లైట్ వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఆదివారం సాయంత్రానికే ముంచెత్తిన వానలు
ద్రోణుల ప్రభావం ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రానికే పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మంగళగిరిలో అత్యధికంగా 68.2 మిల్లీమీటర్ల వర్షం పడగా.. రాజంలో 52.5 మిమీ, కాకుమానులో 51.5 మిమీ, తాడేపల్లిలో 45.2 మిమీ చొప్పున భారీ వానలు కురిశాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాబోయే రెండ్రోజుల్లో ఈ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చెట్ల కింద అస్సలు నిలబడొద్దు
ఈదురుగాలులు, ఉరుములతో వానలు పడేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షం వచ్చేటప్పుడు పొరపాటున కూడా పెద్ద పెద్ద చెట్ల కింద, రోడ్ల పక్కన ఉండే భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని హెచ్చరించారు. గాలి వేగానికి విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉంది కాబట్టి, రోడ్డుపై నడిచేటప్పుడు కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఇక ఆకాశం మబ్బు పట్టి ఉరుములు వినిపించగానే పొలాల్లో ఉండే రైతులు, కూలీలు, పశువుల కాపరులు అస్సలు రిస్క్ తీసుకోకుండా వెంటనే సురక్షితమైన బిల్డింగుల కిందకు వెళ్ళిపోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోనూ రుతుపవనాలు ఫుల్ యాక్టివ్‌గా కదులుతుండటంతో వాతావరణం బాగా కూల్ అయింది. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో వాతావరణ కేంద్రం తెలంగాణవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భాగ్యనగరంలోనూ వాన దంచికొట్టే ఛాన్స్
హైదరాబాద్ వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. నగరంలో ఆకాశం దట్టమైన మబ్బులతో నిండిపోయి ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. పగటిపూటతో పాటు ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం దాదాపు 65 శాతం వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో హఠాత్తుగా కుండపోత జల్లులు పడే ఛాన్స్ ఉంది కాబట్టి, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం మంచిదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.




