Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. నాలుగు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 19 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాబోయే నాలుగు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైనప్పటికీ, ఈ వర్షాలతో ఆ లోటు కొంతవరకు తీరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో నేటి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు మెదక్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడే సూచన ఉంది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేవారు, బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమను ముంచెత్తనున్న వానలు
ఉత్తర థాయ్‌లాండ్‌పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సెప్టెంబర్ 19న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడి తీరం దాటే సమయంలో ఏపీలోని కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.




