Weather Update : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈరోజు దంచికొట్టబోతున్న వర్షాలు, ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్
Weather Update : బంగాళాఖాతంలో వాయుగుండం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే గడిచిన రెండు మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్న నేపథ్యంలో.. ఈ రోజు కూడా వానలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
తెలంగాణలోని ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితి ఇలా..
రాజధాని హైదరాబాద్‌లో ఈ రోజు వాతావరణం విచిత్రంగా మారనుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు కాస్త పెరిగి ఎండ వచ్చే అవకాశమున్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరం వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జిహెచ్‌ఎంసి, హైడ్రా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను గాలులతో వర్షాలు
వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా గట్టిగానే పడనుంది. శుక్రవారం ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాలతో పాటు పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.




