Heritage: చంద్రబాబు కంపెనీకి ఏమైంది..?

Heritage: హెరిటేజ్ ఫుడ్స్ క్యూ2 ఆర్థిక ఫలితాల్లో ఆదాయం 19% పెరిగి రూ. 1,319.6 కోట్లకు చేరింది.

Gagan kumar
Updated on: 17 Oct 2026 12:38 PM IST
Heritage
X

Heritage: చంద్రబాబు కంపెనీకి ఏమైంది..?

Heritage Foods: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన దక్షిణ భారతదేశపు ప్రముఖ డెయిరీ దిగ్గజం హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న ఈ కాలంలో కంపెనీ ఆదాయం మెరుగైన వృద్ధిని సాధించినప్పటికీ, నికర లాభంలో మాత్రం పెద్ద ఎత్తున పతనం నమోదై పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అక్టోబర్ 15న హెరిటేజ్ ఫుడ్స్ షేరు దాదాపు 4 శాతం మేర పతనమైంది.

సంస్థ అందించిన సమాచారం ప్రకారం, ఏకీకృత ప్రాతిపదికన క్యూ2లో హెరిటేజ్ ఫుడ్స్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 39 శాతం తగ్గి రూ. 30.85 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇదే త్రైమాసికంలో పొందిన నికర లాభం రూ. 50.99 కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదలగా చెప్పవచ్చు. అయితే, మునుపటి త్రైమాసికం తో పోల్చి చూస్తే నికర లాభం రూ. 25 కోట్ల నుంచి 24 శాతం పుంజుకోవడం గమనార్హం. లీటరు సగటు పాల సేకరణ ఖర్చు వార్షికంగా 11 శాతం పెరిగి రూ. 47.73కు చేరుకోవడమే లాభాలు తగ్గడానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. అలాగే, వడ్డీ , పన్నులతో కూడిన ఎబిటా 4.4 శాతం తగ్గి రూ. 73.8 కోట్లుగా నమోదైంది.

లాభాలు తగ్గినా ఆదాయం విషయంలో హెరిటేజ్ ఫుడ్స్ మంచి పనితీరు కనబరిచింది. సంస్థ ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన 19 శాతం పెరిగి రూ. 1,319.6 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ ఆదాయం రూ. 1,113 కోట్లుగా ఉండేది. పాల వ్యాపార ఆదాయం 8.5 శాతం వృద్ధి చెందగా, లీటరు సగటు విక్రయ ధర రూ. 60.34గా నమోదైంది. రోజువారీ సగటు పాల సేకరణ 7 శాతం వృద్ధితో 17.28 లక్షల లీటర్లకు పెరిగింది.

సాధారణ పాల విక్రయాల కంటే అధిక మార్జిన్లు ఇచ్చే ల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కేటగిరీలో హెరిటేజ్ ఫుడ్స్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఇది భవిష్యత్తులో కంపెనీ పుంజుకోవడానికి బలమైన నాందిగా కనిపిస్తోంది.

లస్సీ: ఆదాయంలో 91 శాతం, అమ్మకాల పరిమాణంలో 89 శాతం భారీ వృద్ధి.

ఐస్‌క్రీమ్స్: ఆదాయంలో 81 శాతం వృద్ధి, అమ్మకాల్లో 44 శాతం పెరుగుదల.

మజ్జిగ : 66 శాతం ఆదాయ వృద్ధి.

పనీర్: 38 శాతం వృద్ధి.

పెరుగు: 26 శాతం వృద్ధి.

నెయ్యి, వెన్న మినహాయించి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ విభాగం నుండి వచ్చిన మొత్తం ఆదాయం వార్షికంగా 32 శాతం పెరిగి రూ. 451 కోట్లకు చేరుకుంది.పాల సేకరణ వ్యయాలు పెరిగినప్పటికీ ఆదాయం 19 శాతం పెరగడం సానుకూల అంశమని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా తెలిపారు. త్రైమాసిక ప్రాతిపదికన ఎబిటా మార్జిన్ 98 బేసిస్ పాయింట్లు పుంజుకొని 5.6 శాతానికి చేరిందని వెల్లడించారు.

రాబోయే రోజుల్లో పాల సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, అలాగే కొత్త తరహా పోషకాహార ఉత్పత్తులను మార్కెట్లోకి వేగవంతంగా తీసుకురావడంపైనే కంపెనీ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆమె వివరించారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.