Road Accident: మంత్రాలయం వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో-లారీ ఢీకొని ఎనిమిది మంది భక్తుల మృతి!
Road Accident: కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బొలెరో, లారీ ఢీకొని చిక్‌మంగళూరుకు చెందిన 8 మంది భక్తులు మృతి.
Road Accident: మంత్రాలయం వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో-లారీ ఢీకొని ఎనిమిది మంది భక్తుల మృతి!
Road Accident: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు బొలెరో వాహనంలో మంత్రాలయానికి బయలుదేరారు. మార్గమధ్యలో చిలకలడోన వద్దకు రాగానే, వేగంగా వచ్చిన రెడీమిక్స్ లారీ - బొలెరో వాహనం ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి ఐదుగురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉండటం కలిచివేస్తోంది.
మృతుల వివరాలు
పోలీసుల సమాచారం ప్రకారం మృతులను కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 13 మందికి తీవ్ర గాయాలవ్వగా, వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సంతాపం
ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాదంపై ఆరా తీసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు భరత్, జనార్దన్ రెడ్డి కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.




