Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

CR Reddy
Published on: 9 Oct 2026 7:26 AM IST
Weather Update
X

Weather Update

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండల తీవ్రత కొనసాగుతుండగానే మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో పిడుగుపాటు హెచ్చరికలు

తెలంగాణలోని సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ఎవరూ చెట్ల కింద నిలబడవద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

వెనుతిరుగుతున్న నైరుతి రుతుపవనాలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు క్రమక్రమంగా వెనుతిరుగుతున్నాయి. ఈ తిరోగమనం కారణంగా కొన్ని రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. అయితే ఈసారి రుతుపవనాల సమయంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఎల్‌నివో ప్రభావం వల్ల వానలు తగ్గుముఖం పట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట సాగు సరిగా జరగకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.