Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. బంగాళాఖాతంలో త్వరలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. బంగాళాఖాతంలో త్వరలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. ఇది క్రమంగా బలపడి వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేేశారు. దీని కారణంగా ఇరు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్షాలు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో రానున్న వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ఆదివారం నుంచి ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలోనూ ఈదురుగాలులతో కూడిన వానలు
కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రయాణం చేసేవారు అలాగే రోడ్లపై తిరిగే ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తలదాచుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలి. రానున్న రెండు మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.




