Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. రానున్న వారం రోజుల పాటు దంచికొట్టనున్న భారీ వర్షాలు
Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో రాబోయే ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Update
Weather Update : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తమ తాజా బులెటిన్లలో వెల్లడించాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక బలమైన ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఏపీలో మొదలైన వానలు
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఆకాశం మబ్బు పట్టి, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. జూలై 2 నుంచి జూలై 4 వరకు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో వణుకు పుట్టిస్తున్న వానలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 30 నుంచి జూలై 1వ తేదీ మధ్య ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
జూలై మొదటి వారంలోనూ తగ్గని వానల జోరు
జూలై 1 నుంచి జూలై 3వ తేదీ వరకు తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో జూలై 3, 4 తేదీల్లో వాన తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. పాత ఇళ్లు, విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
జూలై 5 వరకు ఏపీలో వాతావరణ సూచన ఇదే
భారత వాతావరణ శాఖ ఏడు రోజుల ముందస్తు సూచనల ప్రకారం.. ఏపీలో జూలై 2 నుంచి జూలై 5 వరకు వర్షాలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. రాయలసీమ జిల్లాల్లో చిరు జల్లులతో వాతావరణం చల్లబడుతుండగా, కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ఆంక్షలు విధించారు. నగరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతి కేంద్రం కోరింది.




