Jana Sena: జనసేన సంస్థాగత బలోపేతానికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. 5 గురు సభ్యులతో ప్రత్యేక కమిటీ!
Jana Sena: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు.
Jana Sena: జనసేన సంస్థాగత బలోపేతానికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. 5 గురు సభ్యులతో ప్రత్యేక కమిటీ!
Jana Sena: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై మరో కీలక అడుగు వేసింది. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో "నిర్మాణ సారథుల" సమాచార సేకరణ ప్రక్రియను ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
జనసేన పార్టీ విస్తరణకు సంస్థాగత నిర్మాణమే బలమనే ఆలోచనతో ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున పనిచేస్తున్న నిర్మాణ సారథుల పూర్తి సమాచారాన్ని ఒకేచోట సమీకరించి, భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగా డేటాబేస్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పార్టీ కేంద్ర కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా పూర్తయ్యేలా ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో తమ్మిరెడ్డి శివశంకరరావు, డా. పెదపూడి విజయ్ కుమార్, డా. పంచకర్ల సందీప్, బుర్రా దివ్య రాజ్, పెనుగొండ సుబ్బారాయుడు సభ్యులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని పరిశీలిస్తూ, పార్టీ కేంద్ర కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తారు. స్థానిక నాయకత్వం, నిర్మాణ సారథులు, జిల్లా స్థాయి బృందాలతో కలిసి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సమాచార సేకరణ కార్యక్రమం రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేయనుంది. ప్రతి నియోజకవర్గంలో పనిచేస్తున్న నిర్మాణ సారథుల వివరాలు, వారి బాధ్యతలు, కార్యాచరణ, పార్టీ కోసం చేసిన సేవలు వంటి అంశాలను నమోదు చేయనున్నారు. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల అమలు, శిక్షణా కార్యక్రమాలు, సంస్థాగత నియామకాలు, ఎన్నికల వ్యూహాలకు ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం జనసేన పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా పాలనలో బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు పార్టీ నిర్మాణాన్ని కూడా సమాంతరంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ కార్యకర్తల సామర్థ్యాన్ని గుర్తించడం, బాధ్యతల కేటాయింపును మరింత సమర్థవంతంగా చేయడం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు బలమైన సంస్థాగత వ్యవస్థను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తన సంస్థాగత వ్యవస్థను మరింత క్రమబద్ధంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రారంభించినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.




