Janasena: దేశ రాజధానిలో జనసేన కీలక సమావేశం

Janasena: జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో “సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం” జాతీయ సమావేశం ఘనంగా జరిగింది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 15 Jun 2026 7:27 PM IST
Janasena
X

Janasena: దేశ రాజధానిలో జనసేన కీలక సమావేశం

Janasena: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన “సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం” సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ స్థాపించి పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో నిర్వహించిన ఈ సమావేశం ద్వారా జనసేన తన జాతీయ దృక్పథాన్ని, రాజకీయ లక్ష్యాలను, భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా వెల్లడించింది. సమావేశంలో దేశాభివృద్ధి, జాతీయ సమైక్యత, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, పార్టీ ప్రస్థానం, యువత ఆకాంక్షలు వంటి అంశాలపై ఐదు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సమావేశం ద్వారా జనసేన కేవలం ప్రాంతీయ రాజకీయ పార్టీగా కాకుండా, దేశవ్యాప్తంగా తన ఆలోచనలను విస్తరించే దిశగా అడుగులు వేస్తోందనే సంకేతాలు కనిపించాయి.

*వికసిత్ భారత్‌... మోదీ నాయకత్వానికి జనసేన మద్దతు*

సమావేశంలో తొలి తీర్మానంగా “వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు” అనే అంశాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

ఈ తీర్మానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్ల పాలనను ప్రశంసించారు. దేశంలో సుపరిపాలన, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ట పెంపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ కాలాన్ని భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక అధ్యాయంగా అభివర్ణించారు. జనసేన అభిప్రాయం ప్రకారం వికసిత్ భారత్ లక్ష్యం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు. ఇది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తున్న జాతీయ ఉద్యమం. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యానికి జనసేన పూర్తి మద్దతు ప్రకటించింది.

*‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతమే జనసేన భావజాలం*

రెండో తీర్మానంగా “నేషన్ ఫస్ట్” అంశాన్ని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రవేశపెట్టారు.దేశ సమగ్రత, జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రతి పౌరుడికి సమాన న్యాయం వంటి అంశాలపై పార్టీ తన అచంచల నిబద్ధతను ఈ తీర్మానం ద్వారా వ్యక్తం చేసింది.

కులం, మతం, భాష, ప్రాంతం అనే విభజనలకు అతీతంగా భారతదేశం ఒకే కుటుంబమనే భావనను జనసేన బలంగా నమ్ముతోందని పేర్కొంది.భారతదేశ వైవిధ్యమే దేశ బలమని, ఆ వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ అభిప్రాయపడింది. దేశ ప్రయోజనాలే ప్రథమం అనే భావనతో రాజకీయాలు సాగాలని ఈ తీర్మానం ద్వారా స్పష్టం చేసింది.

*ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంపై ప్రత్యేక తీర్మానం*

మూడో తీర్మానంగా “సంక్షోభం నుంచి నమ్మకం వైపు ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి” అనే అంశాన్ని ప్రవేశపెట్టారు.

ఈ తీర్మానాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రతిపాదించారు. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జనసేన నాయకత్వం అభినందించింది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి-సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయ స్థిరత్వం, పారదర్శక పాలన, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఎంతో అవసరమని కూడా అభిప్రాయపడ్డారు.

*12 ఏళ్ల జనసేన ప్రస్థానానికి ఘన నివాళి*

నాలుగో తీర్మానం జనసేన పార్టీ పుష్కర కాల ప్రస్థానానికి అంకితం చేశారు. “త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం” అనే అంశంతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సాగిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సామాజిక మార్పు, నైతిక రాజకీయాలు, ప్రజా సమస్యలపై పోరాటం, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తడం వంటి అంశాలు జనసేన ప్రయాణానికి మూల సూత్రాలుగా నిలిచాయని పేర్కొన్నారు.

పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చూపిన దార్శనికత, త్యాగం, పట్టుదల వల్లే జనసేన నేడు ప్రజల్లో విశ్వసనీయ రాజకీయ శక్తిగా ఎదిగిందని నాయకులు అభిప్రాయపడ్డారు. కష్టకాలాల్లోనూ పార్టీని నిలబెట్టిన కార్యకర్తలు, అభిమానులు, నాయకత్వానికి ఈ తీర్మానం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు.పార్టీ స్థాపన సమయంలో ఉన్న ఆశయాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని, భవిష్యత్‌లో ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

*యువతే దేశ భవిష్యత్తు... జనసేన సందేశం*

ఐదో తీర్మానం పూర్తిగా యువత ఆకాంక్షలకు అంకితమైంది. నేటి యువత ఉపాధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శక పాలన వంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతోందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

యువత అవసరాలను అర్థం చేసుకుని వారికి అవకాశాలు కల్పించే రాజకీయ వ్యవస్థ అవసరమని జనసేన అభిప్రాయపడింది. యువతను కేవలం ఓటర్లుగా కాకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములుగా చూడాలనే దృక్పథాన్ని పార్టీ వెల్లడించింది.రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలని, దేశ అభివృద్ధిలో వారి పాత్ర మరింత బలోపేతం కావాలని ఈ తీర్మానం ద్వారా పిలుపునిచ్చారు.

*జాతీయ రాజకీయాల్లో జనసేన కొత్త సంకేతాలు*

ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశం ద్వారా జనసేన పార్టీ తన రాజకీయ పరిధిని రాష్ట్ర సరిహద్దులకు మాత్రమే పరిమితం చేయబోదనే సంకేతాలను పంపింది. దేశ సమైక్యత, వికసిత్ భారత్, నేషన్ ఫస్ట్, యువత సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా జాతీయ రాజకీయ చర్చల్లో తనదైన ముద్ర వేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది.

ఐదు తీర్మానాల ద్వారా పార్టీ భావజాలం, అభివృద్ధి దృక్పథం, జాతీయ సమైక్యత పట్ల నిబద్ధత, యువతపై ఆశలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై సంకల్పం స్పష్టంగా ప్రతిఫలించాయి. “సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం” సమావేశం జనసేనకు కేవలం ఒక పార్టీ కార్యక్రమం మాత్రమే కాకుండా, భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు మార్గదర్శకంగా నిలిచే వేదికగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story