Student Clash: ఫోన్ మిస్సింగ్‌తో రచ్చ రచ్చ.. నర్సింగ్ కాలేజీలో తుక్కుతుక్కు కొట్టుకున్న స్టూడెంట్స్
Student Clash:కాకినాడ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Student Clash
Student Clash: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఉన్న ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్‌లో చిన్న మొబైల్ ఫోన్ చోరీ వివాదం కాస్తా ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు, స్థానిక విద్యార్థులకు మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో జిల్లా యంత్రాంగం, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. కాకినాడ ఎస్‌కే నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో ఆగస్టు 21న ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్థి మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. ఫోన్ వెతికే క్రమంలో స్థానిక విద్యార్థులకు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు మధ్య మాటామాటా పెరిగి వర్గపోరుగా మారింది. రెండు వర్గాలు పరస్పరం భౌతిక దాడులకు దిగడంతో పలువురు ఈశాన్య విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న గాయాలతో కొందరు విద్యార్థులు హాస్టల్ గదుల్లోనే దాక్కుని ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. హాస్టల్ ఆవరణ అంతా భయాందోళనలతో అట్టుడికిపోయింది.
రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం, ఏపీ సీఎంఓ
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు నేరుగా హాస్టల్‌కు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. గొడవలు మరింత పెరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా ఇతర రాష్ట్రాలకు చెందిన 31 మంది విద్యార్థులను వారి అంగీకారంతో వేరొక సురక్షిత హాస్టల్‌కు తరలించారు. ఈశాన్య విద్యార్థులకు ప్రత్యేక వసతి కల్పించి, భద్రత కోసం మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పోలీసు బలగాలను కాపలాగా ఉంచారు.
ఏపీ ప్రభుత్వానికి మణిపూర్ మాజీ సీఎం కృతజ్ఞతలు
ఈ ఘటనపై మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ స్పందిస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన తక్షణమే ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించి విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించడం, రాత్రంతా రక్షణగా మహిళా పోలీసు అధికారిని నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమయానుకూలంగా సాయం అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఏపీ పోలీసు యంత్రాంగానికి బిరేన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని, తమకు కల్పించిన రక్షణపై మణిపూర్ విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారని స్పష్టం చేశారు.




