Kalyandurg: భారీ రక్తదాన శిబిరం.. రికార్డు సృష్టించేలా ఏర్పాట్లు
Kalyandurg: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 20న కళ్యాణదుర్గంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
Kalyandurg: భారీ రక్తదాన శిబిరం.. రికార్డు సృష్టించేలా ఏర్పాట్లు
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజావేదికలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో శిబిరం ఏర్పాట్లు, సమన్వయం, నిర్వహణ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 76వ జన్మదినం సందర్భంగా ఈ నెల 20న ఉదయం 6 గంటల నుంచి రెడ్ క్రాస్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా కళ్యాణదుర్గంలో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ప్రజావేదికలో జరిగే ఈ శిబిరంలో సుమారు 8 వేల మంది రక్తదానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుని ప్రతి ఏర్పాటును కచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ప్రతి రక్తదాతకు రూ.3 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రక్తదానం చేయడానికి వచ్చే వారికి తగిన వసతులు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రక్తదానం ద్వారా అనేకమంది ప్రాణాలను రక్షించవచ్చని, ప్రతి ఒక్కరు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమన్వయంతో పనిచేస్తే ఈ శిబిరాన్ని విజయవంతం చేయగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.




