Parvathipuram Manyam: అమాంతం జెర్రిపామును మింగి.. బీరువాపై చుట్టుకుపోయిన కింగ్ కోబ్రా.. నోట్లోంచి కక్కడంతో గ్రామస్తులు షాక్!
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లా వత్తాడ గ్రామంలోని ఒక ఇంట్లో సోమవారం ఉదయం భారీ కింగ్ కోబ్రా (గిరినాగు) కలకలం సృష్టించింది.
Parvathipuram Manyam: అమాంతం జెర్రిపామును మింగి.. బీరువాపై చుట్టుకుపోయిన కింగ్ కోబ్రా.. నోట్లోంచి కక్కడంతో గ్రామస్తులు షాక్!
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గ్రామంలో సోమవారం ఉదయం భారీ కింగ్ కోబ్రా (గిరినాగు) ప్రత్యక్షమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని వత్తాడ గ్రామానికి చెందిన ఆలుగు పొట్టిందొర ఇంట్లోకి ఈ భయంకరమైన పాము ప్రవేశించింది.
సోమవారం ఉదయం నిద్రలేచిన కొద్దిసేపటికి ఇంట్లో వింత శబ్దం వినిపించడంతో పొట్టిందొర బీరువా వైపు చూశారు. ఏ సమయంలో దూరిందో తెలియదు కానీ, బీరువా పైభాగంలో ఓ భారీ కింగ్ కోబ్రా చుట్టుకుని కనిపించింది. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన పొట్టిందొర వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులకు తెలపగా.. వారు పాముకు ఎలాంటి హాని చేయకుండా చాకచక్యంగా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే వత్తాడ గ్రామానికి చేరుకుని, అది కింగ్ కోబ్రాగా నిర్ధారించారు. అనంతరం విశాఖపట్నం నుంచి ప్రత్యేక స్నేక్ క్యాచర్స్ (Snake Catchers) ను రప్పించారు. మధ్యాహ్నానికి గ్రామానికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. బీరువాపై ఉన్న కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు.
అయితే, పామును పట్టుకున్న కాసేపటికే ఆ కింగ్ కోబ్రా అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. అది తన నోట్లోంచి అప్పటికే చనిపోయిన మరో పెద్ద జెర్రిపామును బయటకు కక్కింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
కింగ్ కోబ్రా మరో పెద్ద పామును అమాంతం మింగడం వల్ల, అది కదల్లేని స్థితిలో ఉండిపోయిందని.. అందుకే ఎవరికీ హాని చేయకుండా బీరువాపై అలా ఉండిపోయిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. లేదంటే ఇంట్లో ఉన్న వారికి పెను ప్రమాదం జరిగి ఉండేదని వాపోయారు. స్నేక్ క్యాచర్స్ ఆ కింగ్ కోబ్రాను సురక్షితంగా పట్టుకుని, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తీసుకువెళ్లడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.




