Amalapuram: కలెక్టర్ మాస్టర్ ప్లాన్.. నిబంధనలు మీరితే యజమానులకు జైలే!
Amalapuram: కోనసీమ జిల్లాలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా కలెక్టర్ మహేష్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు.
Amalapuram: కలెక్టర్ మాస్టర్ ప్లాన్.. నిబంధనలు మీరితే యజమానులకు జైలే!
అమలాపురం కలెక్టరేట్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత మరియు వడగాల్పుల దృష్ట్యా కార్మికుల ఆరోగ్యం మరియు ప్రాణ రక్షణే పరమావధిగా జిల్లా యంత్రాంగం అప్రమత్త మైందని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికలు మరియు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ సూచనల మేరకు, జిల్లాలోని అన్ని పని ప్రదేశాల్లో తక్షణమే అమలులోకి వచ్చేలా పలు మార్గదర్శకాలను జారీచేశారు. పని వేళల మార్పు చేస్తూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పనులను తగ్గించాలన్నారు.
పని వేళలను ఉదయం వేళలకు లేదా సాయంత్రం వేళలకు సర్దుబాటు చేసుకోవాలన్నారు.అన్ని పని ప్రదేశాల్లో కార్మికులకు సరిపడా చల్లటి తాగునీరు మరియు విశ్రాంతి తీసుకోవడానికి నీడ కలిగిన ప్రదేశాలను యజమానులు తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్లు మరియు డీహైడ్రేషన్ బారిన పడకుండా ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.పని ప్రదే శాల్లో ప్రస్తుత ఉష్ణోగ్రతను తెలిపే డిస్ప్లేబోర్డులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. వేడి సంబంధిత అనారోగ్య లక్షణాలపై కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు, తరచూ విరామాలు ఇవ్వాలన్నారు.
గర్భిణీలు మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న కార్మికులు ఎండలో పని చేసేటప్పుడు తప్పనిసరిగా వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణరంగం, పరిశ్రమలు, ఇటుక బట్టీలు మరియు వాణిజ్య సము దాయాల యజమానులు ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ స్పష్టంచేశారు. నిబంధనల ఉల్లంఘన పై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని, కార్మికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. వడగాల్పుల ప్రభావం తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టే అవగాహన కార్యక్రమాలకు ప్రజలు, యజమానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.




