Amalapuram: ప్రైవేట్ కంపెనీల దానా ధరలకు చెక్ రంగంలోకి దిగిన కలెక్టర్!
Amalapuram: కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ కీలక చర్యలు చేపట్టారు.
Amalapuram: ప్రైవేట్ కంపెనీల దానా ధరలకు చెక్ రంగంలోకి దిగిన కలెక్టర్!
అమలాపురం కలెక్టరేట్ : డాక్టర్..బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు పశుసంవర్ధక శాఖ సహకార శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించి కోనసీమ పశుదాన విక్రయాలు రైతులు దానాపట్ల చూపుతున్న ఆసక్తి, పాల దిగుబడి పెరుగుదల అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కోనసీమ పశుదాన విక్రయాలు రైతుల డిమాండ్ ఇతర కంపెనీల బస్సు దానాలు విక్రయాలపై ఒక అధ్యయనం చేసి ఈ నెల 19న సమర్పించాలని ఆదేశించారు.
పశుసంవర్ధక శాఖ సిబ్బంది తమ క్షేత్రస్థాయి పర్యటనలో రైతులకు కోనసీమ పశుదాన పట్ల మక్కువను పెంచే దిశగా ప్రోత్సహించాలని తద్వారా రైతుకు అదనపు ఆదాయం చేకూరి పాడి పరిశ్రమ లాభసాటిగా మారుతుందన్నారు. జిల్లాలోని పాడి రైతుల సంక్షేమం మరియు పశుసంపద అభివృద్ధిని కాంక్షిస్తూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ఇరు శాఖలు పూర్తి సమన్వయం వహించి పాడి పరిశ్రమకు నూతన జవసత్వాలు తీసుకు రావాలన్నారు జిల్లాలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు, పశువులకు అత్యంత పోషక విలువలు కలిగిన దానాను తక్కువ ధరకే రైతులకు అందుబాటు లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వినూత్న ఆలోచనతో కోనసీమ పశుదాన విక్రయాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
సహకార సంఘాలలో అవసరమైన కోనసీమ పశుదాన నిల్వలకు జాగా ఉంచుకొని త్వరితగతిన విక్రయాలు నిర్వహించాలని లేనిపక్షంలో పురుగులు ఆశించే అవకాశం ఉంటుందన్నారు .జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ప్రముఖ పశుగ్రాస తయారీ కంపెనీలతో చర్చలు జరిపి, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే నాణ్యమైన దానాను సరఫరా చేసేలా ఒప్పం దాలు కుదుర్చుకోవడం జరిగిందన్నారు లాభాపేక్ష లేకుండా, కేవలం రైతుల సేవయే పరమావధిగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా ఈ మల్టీ-గ్రేడ్ దానాను విక్రయించడం జరుగుతుందన్నారు.నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ దానాలో పశువులకు అవసరమైన ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు ప్రోటీన్లు సరైన మోతాదులో ఉండేలా మల్టీ-గ్రేడ్ పద్ధతిలో తయారు చేసి మార్కెట్లో ఇతర కంపెనీల కంటే తక్కువ ధరకే రాయితీపై ఇస్తున్నట్లు తెలిపారు.
దీనివల్ల పాల దిగుబడి పెరగడమే కాకుండా పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. పాడి పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను లోతుగా అధ్య యనం చేసి, రైతులకు మరిన్ని రాయితీలు మరియు సాంకేతిక సహకారం అందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమ రైతులకు ప్రధాన జీవనాధారంగా ఉందని పెరిగిన దానా ధరలతో రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభి వృద్ధి చెందాలన్నారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి అనిత జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ, రోళ్లపాలెం సొసైటీ అధ్యక్షులు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్ రావు వివిధ డైరీ ఫామ్ ప్రతినిధులు పాల్గొన్నారు.




