Amalapuram: నిధుల మళ్లింపు లేకుండా నేరుగా లబ్ధి.. లంకా దినకరన్ కీలక వ్యాఖ్యలు!
Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో 20 సూత్రాల కమిటీ అధ్యక్షుడు లంకా దినకరన్, ఎంపీ హరీష్ బాలయోగి నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Amalapuram: నిధుల మళ్లింపు లేకుండా నేరుగా లబ్ధి.. లంకా దినకరన్ కీలక వ్యాఖ్యలు!
అమలాపురం: కలెక్టరేట్ శుక్రవారం కలెక్టరేట్ లోని 20 సూత్రాల కమిటీ అధ్యక్షుడు లంకా దినకరన్ అధ్యక్షతన 20 సూత్రాల ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి వైద్య ఆరోగ్యం, విద్య, అమృత్ 2.0., జల జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ & అజీవికా మిషన్ గ్రామీణ పథకాల పురోగతి పై సమీక్షించారు.
ఈ సందర్భంగా దినకర్ ప్రసంగిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ సర్కార్ కృషితో ఈ లక్ష్య సాధనను ఎంతో సునాయాసంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రాయోజిక పథకాలను పూర్తిస్థాయిలో వినియో గించుకొనేందుకు ముఖ్య మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఈ లక్ష్య సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతంగా అమలు చేసే దిశగా తాను అడుగులు వేస్తున్నట్లు దినకర్ తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీబీ-జీ రామ్ జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జననీ సురక్ష యోజన కింద గర్భిణులకు అందుతున్న సేవలు, నగదు సహాయంపై వివరాలు తెలుసుకున్నారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధికి వివిధ దశల్లో మంజూరైన నిధులను పూర్తిగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
జలజీవన్ మిషన్ కింద ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానికంగా క్వాయర్ బోర్డ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వర్యులుతో సంప్రదించి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటానన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో కోనసీమలో తల్లీ,పిల్లల ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేయాలన్నారు.గర్భిణీలు, బాలింతలు, శిశువుల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని నిధుల మళ్లింపు లేకుండా అర్హులకు నేరుగా లబ్ధి చేకూర్చడమే డబుల్ ఇంజన్’ సర్కార్ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సాగుతున్న గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య రక్షణ కొరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర @2047' విజన్ కు అనుగుణంగా అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
జననీ సురక్ష యోజన, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా జిల్లాలోని గర్భిణీ స్త్రీలకు పారదర్శకంగా ఆర్థిక సాయం,పౌష్టికాహార పంపిణీ చేయాలన్నారు. గర్భిణీ సమయం నుండి ప్రసవం వరకు తల్లీ, పిల్లలను ఆరోగ్యంగా కాపాడుకునేలా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.పోషణ్ అభియాన్ అంగన్ వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, చిన్నారులకు అందుతున్న బలవర్ధకమైన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
జిల్లాలో రక్తహీనత నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థను మెరుగుపరుస్తూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన కుళాయి కనెక్షన్ అందించి మహిళల నీటి కష్టాలను తీరుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రతి రూపాయి నేరుగా లబ్ధి దారులకు, నిర్దేశిత పనులకే ఖర్చయ్యేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తల్లీ-పిల్లల సంరక్షణే ధ్యేయంగా అధికారులు పాటుపడాలన్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒక్క అర్హులైన తల్లి కూడా పథకాలకు దూరం కాకూడదన్నారు. క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి కేంద్ర-రాష్ట్ర సంక్షేమ ఫలాలను ప్రజల చెంతకు చేర్చాలన్నారు.ప్రజల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారద ర్శకంగా చేరే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణం, పారిశుధ్యం, తాగునీరు, ఉపాధి హామీ, మహిళ బాలల సంక్షేమం, రైతు సంక్షేమ కార్య క్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జి. హరీష్ మాధుర్ బాలయోగి, జాయింట్ కలెక్టర్ వైఖమ్ నిధియాదేవి, డిఆర్ఓ వి .సుబ్బారావు మరియు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.




