Nara Lokesh: లోకేష్‌తో క్రికెట్ లెజెండ్ జాంటీ రోడ్స్ భేటీ.. ఏపీ స్పోర్ట్స్ హబ్ విజన్‌పై చర్చలు!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి నారా లోకేష్‌ను స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ కలిశారు.
Nara Lokesh: లోకేష్‌తో క్రికెట్ లెజెండ్ జాంటీ రోడ్స్ భేటీ.. ఏపీ స్పోర్ట్స్ హబ్ విజన్‌పై చర్చలు!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అండ్ యూత్ డెవలప్‌మెంట్ రంగానికి సరికొత్త గ్లోబల్ టచ్ దొరికింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ (Jonty Rhodes).. ఏపీ ఐటీ, క్రీడల శాఖ మంత్రి నారా లోకేష్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, యువతకు ఉపాధి-క్రీడా అవకాశాలు, క్రీడారంగంలో అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల (Sports Innovations)పై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
క్రికెట్ దిగ్గజంతో జరిగిన ఈ సమావేశంపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఉత్తమ క్రీడా పద్ధతులను ఏపీలో అవలంబించడం, రాబోయే తరం ఛాంపియన్లను (Next-Gen Champions) ఇక్కడే తీర్చిదిద్దడంపై మేమిద్దరం మేధోమథనం చేశాం. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రీడాకారుల్లో అచంచలమైన స్ఫూర్తిని నింపిన జాంటీ రోడ్స్‌ను కలవడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది" అని లోకేష్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అకాడమీలను స్థాపించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ తరుణంలో జాంటీ రోడ్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఏపీ ప్రభుత్వంతో చేతులు కలపడం క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.




