Kurnool: లండన్ విద్యార్థినిని ఆకట్టుకున్న కప్పట్రాళ్ల రైతులు
Kurnool: లండన్ పీహెచ్‌డీ విద్యార్థిని భవిక కప్పట్రాళ్ల గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
Kurnool: లండన్ విద్యార్థినిని ఆకట్టుకున్న కప్పట్రాళ్ల రైతులు
Kurnool: కప్పట్రాళ్ల గ్రామాన్ని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీహెచ్‌డీ అని విద్యార్థిని భవిక, జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి మాధురి కలిసి సందర్శించారు. గ్రామంలోని రంగస్వామి పొలాన్ని పరిశీలించి, అక్కడ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ చక్రాన్ని పరిశీలించి, రైతులు విత్తనాల ఎంపిక మరియు సాగు విధానాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా పొలంలో మహాగని మరియు టెంకాయ మొక్కలను నాటడం జరిగింది. అలాగే పిఎండిఎస్ విధానంలో విత్తనాలను వేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచుతున్న మామిడి, సపోటా తోటలను కూడా సందర్శించారు.
భవిక మాట్లాడుతూ, గ్రామంలోని రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అభినందించారు. సే ట్రీస్ వంటి సంస్థల సహకారంతో ఆగ్రో ఫారెస్ట్రీ తోటలను అభివృద్ధి చేస్తున్న విధానం ప్రశంసనీయం అని తెలిపారు.
అనంతరం ప్రకృతి వ్యవసాయాన్ని ఆదర్శంగా అమలు చేస్తున్న రంగన్న దంపతులను సన్మానించారు. తరువాత గ్రామ జ్యోతి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆకే రవికృష్ణ ఐపీఎస్ తో వర్చువల్ గా సమావేశమయ్యారు.
ఆయన మాట్లాడుతూ కప్పట్రాళ్ల గ్రామం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ గ్రామంగా మారాలని తన ఆకాంక్ష అని తెలిపారు. ప్రతి రైతు ఈ పద్ధతులను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను అభినందించారు. మహిళా సంఘాల ద్వారా ఈ విధానాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించారు.
జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి మాధురి మాట్లాడుతూ, కప్పట్రాళ్లలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని కోరారు. త్వరలో బీఆర్‌సీ సెంటర్‌ను ప్రారంభించి, రైతులకు అవసరమైన ప్రకృతి వ్యవసాయ కషాయాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. శాఖ నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఫుడ్ బాస్కెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొదుపు మహిళా సంఘాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వేసవికాలంలో పిఎండిఎస్ విధానాన్ని ప్రతి రైతు పాటించాలని, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు.
చివరిగా కప్పట్రాళ్ల మల్లికార్జున చీని తోటను పరిశీలించారు. అగ్రో ఫారెస్ట్రీ మోడల్లో చినితోటను అద్భుతంగా సాగు చేస్తున్నారని అభినందించారు. అంతర్ పంటలు వేసుకొని అధిక దిగుబడులు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ జ్యోతి సీఈఓ నారాయణ, మండల టీడీపీ నాయకులు కప్పట్రాళ్ల మల్లికార్జున, గ్రామ సంఘ నాయకులు భవాని, అంజనమ్మ, విజయమ్మ, గ్రామ జ్యోతి కోఆర్డినేటర్ చింతమాను రవికుమార్, చాకలి లక్ష్మన్న, ఎర్ర కౌలుట్లయ్య, పాపన్న, దోసకాయ లింగన్న, ఐసిఆర్‌పి రాముడు, సిబ్బంది సుధాకర్, సుంకన్న, ఎంటి సుధాకర్, డి ఎం ఎం టి రంగస్వామి, న్యూట్రిషన్ సిబ్బంది గౌతమి, ప్రసుద తదితరులు పాల్గొన్నారు.




