Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచి వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Weather Update
Weather Update: ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు లేక అల్లాడిపోతున్న రైతాంగానికి, గణేష్ నిమజ్జనం కోసం నీరు లేక ఆందోళన చెందుతున్న భక్తులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచి వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడన ప్రభావం
వాయువ్య-పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో విస్తారంగా వానలు
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి అంతటా ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అదనంగా వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాలలో కూడా మోస్తరు వర్షాలతో పాటు చెదురుమదురు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో దంచికొట్టనున్న వర్షాలు
మరోవైపు భాగ్యనగరంలోనూ వానలు దంచికొట్టేందుకు రంగం సిద్ధమైంది. రాబోయే గంటల్లో నగరంలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా అమీన్‌పూర్, దుండిగల్, బాచుపల్లి, నిజాంపేట్, మల్లంపేట్, బొల్లారం, కుత్బుల్లాపూర్, గాజులరామారం, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, బాలానగర్, అల్వాల్, మల్కాజిగిరి, యాప్రాల్, మేడ్చల్ తదితర ప్రాంతాలలో వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఈ వర్షాల వల్ల చెరువుల్లో నీరు చేరి గణేష్ నిమజ్జన కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగే అవకాశం ఉంది.




