మహానాడు బందోబస్తుపై పోలీసుల హైలెవల్ మీటింగ్: డ్రోన్లతో నిఘా, ఈ-డిప్లాయ్‌మెంట్ ద్వారా డ్యూటీలు!
Mahanadu: మహానాడు భద్రతా ఏర్పాట్లపై డీఐజీ పకీరప్ప, ఎస్పీ అజిత వేజెండ్ల సమీక్ష నిర్వహించారు.
మహానాడు బందోబస్తుపై పోలీసుల హైలెవల్ మీటింగ్: డ్రోన్లతో నిఘా, ఈ-డిప్లాయ్‌మెంట్ ద్వారా డ్యూటీలు!
మహానాడు భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో నిర్వహించబడనున్న మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లపై ఇఫ్కో అడ్మిన్ బిల్డింగ్ కాన్ఫరెన్స్ హల్ నందు ఉన్నతస్థాయి పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా డీఐజీ లా అండ్ ఆర్డర్ పకీరప్ప, డీఐజీ రైల్వేస్ సత్య ఏసుబాబు, నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, పార్కింగ్ జోన్లు, ప్రజల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన అప్రోచ్ రూట్లు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు మరియు చెక్ పోస్టులను పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల మహానాడు బందోబస్తు నిమిత్తం నియమించబడిన పోలీసు అధికారులను డీఐజీ కి పరిచయం చేశారు.
మహానాడు కార్యక్రమం విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి అధికారికి కేటాయించిన బాధ్యతలు, విధులు మరియు సమన్వయ చర్యలపై విస్తృతంగా చర్చించారు. భారీ సంఖ్యలో ప్రజలు మరియు వాహనాలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్స్, పార్కింగ్ ఏర్పాట్లు, హోల్డింగ్ పాయింట్లు, జాతీయ రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తీసుకోనున్న చర్యలు గురించి జిల్లా ఎస్పీ డీఐజీ కి సమగ్రంగా PPT ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. అదేవిధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు, భద్రతా పర్యవేక్షణ చర్యల గురించి కూడా వివరించారు.
బందోబస్తు విధులకు వచ్చే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో అధికారులు సూచించారు. విధులకు హాజరయ్యే పోలీసు సిబ్బంది డిప్లాయ్‌మెంట్ మొత్తం e - డిప్లాయ్‌మెంట్ పోర్టల్ ద్వారా నిర్వహించాలని ఆదేశించారు.
అలాగే బందోబస్తుకు వచ్చే అధికారులకు మరియు సిబ్బందికి ఫుడ్ అండ్ అకామడేషన్ ఏర్పాట్లు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా చర్చించారు. కార్యక్రమ ప్రాంతంలో సీసీటీవీ పర్యవేక్షణ, డ్రోన్ సర్వీలెన్స్, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సిహెచ్ సౌజన్య , ఎస్‌బీ డీఎస్పీ ధీరజ్ వినీల్ , అన్ని సబ్ డివిజన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




