AP Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. స్పందించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్!

AP Elections: రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సంచలన ప్రకటన చేసింది.

CR Reddy
Published on: 22 Oct 2026 8:01 AM IST
AP Municipal Elections 2026
X

AP Municipal Elections 2026

AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సంచలన ప్రకటన చేసింది. నామినేషన్ల దాఖలు సమయంలో తమ అభ్యర్థులను అడ్డుకున్నారంటూ ప్రతిపక్ష వైసీపీ దాఖలు చేసిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, వాటిని సమగ్రంగా పరిశీలించాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. దీంతో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది.

నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు ఊరట

సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈనెల 25 వరకు వాయిదా వేశారు. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల నుంచి వచ్చే వినతులు, ఆధారాలను లోతుగా పరిశీలించి నోటిఫికేషన్‌ను సవరించేందుకు ఎస్‌ఈసీ చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

కూటమి నేతల స్పందన

ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర అధికార కూటమి స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ నేత మాధవ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను మొదటి రోజు నుంచే అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, కోర్టుల్లో పదుల సంఖ్యలో పిటిషన్లు వేసి వికాస పనులకు ఆటంకం కలిగిస్తోందని విమర్శించారు. పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

వైసీపీ న్యాయపోరాటం

స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరిగితేనే 16వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర గ్రాంట్లు వేగంగా రాష్ట్రానికి చేరుతాయని కూటమి నేతలు తెలిపారు. వైసీపీ హయాంలో బలవంతపు ఏకగ్రీవాలు, అక్రమాలు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. మరోవైపు తమ అభ్యర్థులకు రక్షణ కల్పించి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ కోర్టును ఆశ్రయించగా, ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీ తుది నిర్ణయం తర్వాతే మున్సిపల్ పోరుపై పూర్తి స్పష్టత రానుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.