Maneka Gandhi: గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి.. సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ

Maneka Gandhi: తిరుపతి గంగమ్మ జాతరలో జంతు బలులను నిలిపివేయాలని కోరుతూ మేనకా గాంధీ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 6 May 2026 10:21 AM IST
Maneka Gandhi
X

Maneka Gandhi: గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి.. సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ

Maneka Gandhi: తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతరలో జంతు బలులను నిరోధించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి, జంతు సంరక్షకురాలు మేనకా గాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న జాతర సందర్భంగా వేలాది మూగజీవాలను బలి ఇచ్చే అవకాశం ఉందని, ఈ హింసను తక్షణమే అరికట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జంతు బలులను ఇప్పటికే నిషేధించారని మేనకా గాంధీ గుర్తుచేశారు. జంతువులను చంపడానికి బదులుగా కొబ్బరికాయలు కొట్టేలా భక్తులను ప్రోత్సహించాలని ఆమె సూచించారు. "టెక్నాలజీ, అభివృద్ధిలో ముందుచూపు ఉన్న చంద్రబాబు వంటి నాయకుడికి ఈ హింసను ఆపడం సాధ్యం కాదా?" అని ఆమె లేఖలో ప్రశ్నించారు.

జంతు బలులు సమాజంలో హింసను ప్రేరేపిస్తాయని మేనకా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బలుల సమయంలో చాలామంది మద్యం సేవించి ఉండటం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అనేకమంది యువకులు, వైద్యులు, ప్రొఫెసర్లు ఈ మారణకాండను ఆపాలని తనకు లేఖలు రాశారని ఆమె పేర్కొన్నారు.

వేలాది మూగజీవాలను చంపడం దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోందని, ఇది అత్యంత దారుణమైన సామూహిక హత్యగా మారుతోందని ఆమె పేర్కొన్నారు. భక్తులను చైతన్యపరిచి, ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. తక్షణమే స్పందించి గంగమ్మ జాతరలో జంతు బలులు జరగకుండా కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని చంద్రబాబును కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story