Vizag HPCL Plant: విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు

Vizag HPCL Plant: ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

CR Reddy
Published on: 3 Nov 2026 7:01 AM IST
HPCL Refinery
X

HPCL Refinery

Vizag HPCL Plant: ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక మర్రిపాలెం, మల్కాపురం ప్రాంతాల్లో ఉన్న హెచ్‌పీసీఎల్ (HPCL) రిఫైనరీలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఫైనరీకి చెందిన నూతన రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ (RUF)లోని పిచ్ ట్యావర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ యూనిట్‌లో భారీ వాక్యూమ్ రెసిడ్యూ ఆయిల్‌ను డీజిల్, పెట్రోల్ వంటి స్వచ్ఛమైన ఇంధనాలుగా మార్చే ప్రక్రియ నిర్వహిస్తుంటారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున నల్లటి పొగ ఆకాశాన్ని తాకింది.

భారీ శబ్దంతో పేలుడు

ఆగస్ట్ రాత్రి సమయంలో ప్లాంట్ నుంచి ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడిన పెద్ద పేలుడు వినబడటంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆకాశంలో ఎగిసిపడుతున్న ఎర్రటి మంటలను, దట్టమైన పొగను సుదూర ప్రాంతాల నుంచి కూడా స్పష్టంగా చూడగలిగారు. దీంతో సమీప బస్తీల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులు కొద్దిసేపు తీవ్ర ఆందోళన చెందారు.

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

ప్రమాదం జరిగిన వెంటనే రిఫైనరీ ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్స్ అప్రమత్తమయ్యాయి. ఆన్-డ్యూటీలో ఉన్న సిబ్బందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెచ్‌పీసీఎల్ అంతర్గత ఫైర్ అండ్ సేఫ్టీ బృందాలు రంగంలోకి దిగి సొంత ఫైర్ ఇంజిన్ల ద్వారా తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. మల్కాపురం పోలీసు ఇన్‌స్పెక్టర్ ఈ. నరసింహారావు మాట్లాడుతూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రజలకు ధైర్యం చెప్పారు.

ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు

విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాతో మాట్లాడుతూ అగ్నిప్రమాదం కేవలం ఒక్క ట్యాంక్‌కే పరిమితం కావడం వల్ల పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. పైగా ట్యాంక్ నుంచి వెలువడిన పొగ ఎలాంటి హానికరమైనది కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిచ్ యూనిట్ నిర్మాణాలకు కొంతమేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.