Gas Leak: కోనసీమలో గ్యాస్ కలకలం.. ఏ క్షణం ఏం జరుగుతుందోనని జనాల ఆందోళన
కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని ONGC Well-7 నుంచి రీ డ్రిల్లింగ్ సమయంలో సహజ వాయువు లీకైంది. గ్యాస్ వాసన పరిసరాలకు వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
ONGC Gas Leak
Gas Leak: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని ONGC Well-7 నుంచి భారీగా సహజ వాయువు బయటకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బావి వద్ద రీ-డ్రిల్లింగ్ పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్యాస్ ఉధృతంగా బయటకు రావడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్యాస్ వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
రీ డ్రిల్లింగ్ సమయంలో ఒక్కసారిగా లీక్
నగరం గ్రామంలోని ONGC బావి వద్ద రీ-డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాస్ బయటకు ఎగసిపడినట్లు సమాచారం. ఈ ఘటనతో బావి పరిసరాల్లో కలకలం నెలకొంది. గ్యాస్ మరింత దూరం వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికులు, అటుగా వెళ్లే ప్రయాణికులు ప్రమాద ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేత
ఈ ఘటన గెద్దాడ–మామిడికుదురు జాతీయ రహదారికి సమీపంలో జరగడంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. గెద్దాడ వద్ద హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం. ప్రమాద ప్రాంతం వైపు వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. అటుగా ప్రయాణించే వారు పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీ
గ్యాస్ లీక్ సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. లీకేజీని నియంత్రించేందుకు సంబంధిత అధికారులతో చర్చించారు. మరోవైపు నరసాపురం నుంచి ప్రత్యేక సహాయక బృందం కూడా ఘటనాస్థలానికి బయలుదేరినట్లు సమాచారం. గ్యాస్ లీక్‌ను అరికట్టేందుకు సాంకేతిక సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
లీకేజీ అదుపులోకి వచ్చిందా?
ప్రస్తుతం గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ లీకేజీకి అసలు కారణం ఏమిటి? ఎంత మేర గ్యాస్ బయటకు వస్తోంది? పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందా? అనే వివరాలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రాణనష్టం లేదా ఆస్తినష్టానికి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో లేదు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో నగరం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.




