Atchannaidu: జగన్‌కు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్.. "ఆ అబద్ధాలు ఇక సాగవు.. ఈసారి ఆ ఛాన్స్ ఇచ్చేదే లేదు!"
Atchannaidu: జగన్ పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Atchannaidu: జగన్‌కు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్.. "ఆ అబద్ధాలు ఇక సాగవు.. ఈసారి ఆ ఛాన్స్ ఇచ్చేదే లేదు!"
Atchannaidu: గత వైకాపా ప్రభుత్వంపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ సభలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, గత ప్రభుత్వ వేధింపుల నిర్వాకం వల్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని అచ్చెన్నాయుడు కొనియాడారు. "ఏ రాష్ట్రానికైనా పరిశ్రమల ద్వారానే ఆదాయం సమకూరుతుంది. ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. కానీ, చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని మన కూటమి ప్రభుత్వం కేవలం 24 నెలల పాలనలోనే అక్షరాలా రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించి ఏపీని మళ్లీ ప్రగతి పథంలో నిలిపింది."
— కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీ మంత్రి
పేద ప్రజలు కేవలం రూ.5కే కడుపునిండా తినే 'అన్న క్యాంటీన్' పథకాన్ని వైకాపా హయాంలో అన్యాయంగా ఎత్తివేశారని మండిపడ్డారు. ఈ పథకాన్ని ఆపొద్దని తాము శాసనసభలో బతిమిలాడినా గత ప్రభుత్వం వినలేదని గుర్తుచేశారు. ప్రజలు, ప్రాంతాల మధ్య జగన్ తగవులు పెట్టి 3 రాజధానుల డ్రామా ఆడారని విమర్శించారు. అందుకే మూడు ప్రాంతాల్లోనూ వైకాపాకు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, వైకాపా నిర్వీర్యం చేసిన పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిన పెట్టామని స్పష్టం చేశారు.
"2014-19 మధ్య తెదేపా అధికారంలో ఉండగా అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమం జరిగాయి. కానీ మనం చేసిన మంచిని సరిగ్గా చెప్పుకోలేకపోయాం. దాంతో వైకాపా చెప్పిన అబద్ధాలను నమ్మి ప్రజలు 2019లో వారికి ఓటేశారు. జగన్.. ఈసారి మీకు ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వం. కూటమి ప్రభుత్వం చేసిన ప్రగతి పనులను ప్రతి ఒక్క ప్రజలకూ చెప్పి, వారిని చైతన్యపరుస్తాం. ఈ రాష్ట్రంలో వైకాపాను పాతాళానికి పాతిపెట్టడం ఖాయం" అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.




