Pushkar: ఎత్తిపోతల పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం!

Pushkar: పుష్కర ఎత్తిపోతల పైప్‌లైన్ పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 12 Aug 2026 1:48 PM IST
Pushkar
X

Pushkar: ఎత్తిపోతల పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం!

Pushkar: పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల్లో జాప్యంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాలకు అత్యంత కీలకమైన పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. నిర్ణయించిన వర్క్ షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టు సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు...

పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు అందించిన వర్క్ షెడ్యూల్ ప్రకారం పనులు ఎందుకు సాగడం లేదని ప్రశ్నించారు...

వర్క్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కూడా పనుల్లో వేగం పెంచకపోవడంపై మంత్రి మండిపడ్డారు. పనుల వాస్తవ పరిస్థితిని ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి తనకు నివేదిక అందించారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా పనుల్లో జాప్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు...

ప్రజాప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్, ఎస్పీలను మంత్రి ఆదేశించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి, జైలుకు పంపేందుకు కూడా వెనుకాడవద్దని స్పష్టం చేశారు. పనుల్లో అలసత్వం వహించిన ఈఈకి మెమో జారీ చేయాలని ఈఎన్సీ నరసింహమూర్తిని ఆదేశించారు...

ఇకపై పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులపై ప్రతిరోజూ వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టును అందించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రోజు పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు...

ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు. గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు పుష్కర ఎత్తిపోతల పథకం కీలకమని పేర్కొన్నారు...

ఈ నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలు వెళ్లేలా నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పుష్కర ఎత్తిపోతల పైప్‌లైన్ పనులకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు...

గోదావరి జలాల సద్వినియోగం, సాగునీటి అవసరాలు, రానున్న క్లిష్ట వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పుష్కర పథకం పనుల్లో ఏ మాత్రం జాప్యం జరిగినా దాని ప్రభావం ప్రజలపై పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇకపై పనుల పురోగతిపై ప్రతిరోజూ పర్యవేక్షణతో పాటు, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు...

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story