Rajanagaram: రాజానగరం అభివృద్ధికి రూ.540 కోట్లు ఎమ్మెల్యే కీలక ప్రకటనలు!
Rajanagaram: రాజానగరం నియోజకవర్గానికి రూ.540 కోట్ల నిధులు. ఇండస్ట్రియల్ పార్క్, 100 పడకల ఆసుపత్రి, రింగ్ రోడ్డు ప్రాజెక్టులపై ఎమ్మెల్యే బత్తుల ప్రకటన.
Rajanagaram: రాజానగరం అభివృద్ధికి రూ.540 కోట్లు ఎమ్మెల్యే కీలక ప్రకటనలు!
Rajanagaram: రాబోయే రోజుల్లో రాజానగరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బత్తుల పేర్కొన్నారు. గత రెండేళ్లలోనే రాజానగరం నియోజకవర్గానికి సుమారు 540 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
విద్య, వైద్య రంగాలకు ఇకపై మరింత ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే చెప్పారు. హెల్త్ క్లినిక్‌ల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, త్వరలో రాజానగరానికి 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా రాజానగరంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. సుమారు 600 ఇండస్ట్రియల్ ప్లాట్ల ద్వారా పరిశ్రమలకు అవకాశం కల్పిస్తామని, MSMEల ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా త్వరలో ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మునికోడల ఘాట్‌ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల చెప్పారు. ఘాట్‌లో డ్రైనేజీ, రోడ్ల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మునికోడల ఘాట్‌ను దేశంలోనే ఆదర్శ ఘాట్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
గోదావరి కాలుష్య నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పేపర్ మిల్లు వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, కాలుష్యరహితంగా గోదావరి పుష్కరాలు నిర్వహించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
రాజానగరం నియోజకవర్గాన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే నంబర్‌వన్ నియోజకవర్గంగా నిలబెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల తెలిపారు. అభివృద్ధి పనుల కోసం అధికారులు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో నిరంతరం సమన్వయం చేస్తున్నామని చెప్పారు.
నియోజకవర్గానికి 860 కోట్ల రూపాయల నిధులు కోరగా, ఇప్పటివరకు 480 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. బొబ్బులంక నుంచి మధురపూడి, నిడదవోలు, పాలచెర్ల తదితర ప్రాంతాలను కలుపుతూ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఉందని, హైవేతో అనుసంధానించేలా అద్భుతమైన రహదారి నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరిన్ని పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. భూముల ధరలు, ల్యాండ్ అక్విజిషన్ సమస్యల కారణంగా కొన్ని పనుల్లో ఆలస్యం జరుగుతోందని వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బత్తుల తెలిపారు. కుల, మత, పార్టీ భేదాలు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, రైతులకు సంబంధించిన పథకాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బత్తుల స్పష్టం చేశారు.




