Anantha Babu Arrest: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. కోర్టు ఆవరణలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Anantha Babu Arrest: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై కోర్టుకు హాజరైన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Arun Chilukuri
Published on: 24 April 2026 2:47 PM IST
Anantha Babu Arrest
X

Anantha Babu Arrest: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. కోర్టు ఆవరణలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Anantha Babu Arrest: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాజమండ్రి కోర్టులో విచారణకు హాజరైన ఆయనను, బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉత్కంఠ రేపింది.

సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ-1గా ఉన్న అనంతబాబుకు గతంలో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. తన భార్య లక్ష్మీదుర్గ (ఏ-2)తో కలిసి కోర్టుకు హాజరైన అనంతబాబును, విచారణ ముగిసిన వెంటనే పోలీసులు చుట్టుముట్టారు. అక్కడి నుండి ఆయన్ను కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.

2022 మే నెలలో తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణను నవంబర్ 30 లోపు పూర్తి చేయాలని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సాక్షులను బెదిరించారన్న పోలీసుల ఫిర్యాదుతో బెయిల్ రద్దు ప్రక్రియ వేగవంతమైంది.

అనంతబాబు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి కోర్టు సముదాయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బాధితులకు న్యాయం చేయాలని దళిత సంఘాలు ఆందోళనలు చేస్తున్న తరుణంలో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అనంతబాబు అరెస్టుతో ఈ కేసు విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story