Weather Update : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ద్రోణి ప్రభావంతో ఐదు రోజుల పాటు జల్లులు
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 20వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉంది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 20వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉంది. రెండో వారం చివరకల్లా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మీదుగా ఇవి ప్రవేశిస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటులో 92 శాతంగానే ఉండొచ్చని, అంటే సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ ప్రాథమిక అంచనా వేసింది. ఇది పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుపై ప్రభావం చూపి, ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏపీలో ద్రోణి ప్రభావం.. పిడుగుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలోని అల్లూరి, విశాఖ నుంచి మొదలుకొని రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల వరకు దాదాపు అన్ని చోట్లా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండవద్దని, సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఒకవైపు వానలు.. మరోవైపు వడగాల్పులు
చిత్రంగా ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే, మరికొన్ని చోట్ల వడగాల్పులు వీస్తున్నాయి. అల్లూరి జిల్లాలోని చింతూరు, మారేడుమిల్లి, తూర్పుగోదావరిలోని రాజమండ్రి, కోనసీమలోని ఆత్రేయపురం వంటి ప్రాంతాల్లో వేడి గాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పోలవరం, వీఆర్ పురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. అంటే మధ్యాహ్నం వరకు మంటలు పుట్టించే ఎండ, సాయంత్రం పూట చల్లని గాలులతో కూడిన జల్లులు పలకరించనున్నాయి.
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణ ప్రజలకు కూడా ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు (మే 10) హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. అయితే మే 11 తర్వాత మళ్ళీ పొడి వాతావరణం ఏర్పడి ఎండలు పెరిగే ఛాన్స్ ఉంది.




