Mudragada Padmanabham: ముద్రగడ కుమార్తెను అడ్డుకున్న కుటుంబ సభ్యులు.. కన్నీటితో వెనుదిరిగిన క్రాంతి!
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, ఏపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Mudragada Padmanabham: ముద్రగడ కుమార్తెను అడ్డుకున్న కుటుంబ సభ్యులు.. కన్నీటితో వెనుదిరిగిన క్రాంతి!
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, ఏపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్న వేళ.. ముద్రగడ కుమార్తె క్రాంతి శీల రాక తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీసింది.
ముద్రగడ మరణవార్త తెలిసిన వెంటనే ఆయనకు చివరి నివాళి అర్పించేందుకు క్రాంతి శీల కిర్లంపూడికి బయలుదేరారు. అయితే శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తుగా ఆమెను ప్రత్తిపాడు వద్దే అడ్డుకున్నారు. ఆ తర్వాత చర్చల అనంతరం ఆమెను గ్రామానికి అనుమతించినప్పటికీ, అసలు వివాదం ముద్రగడ నివాసం వద్దే మొదలైంది.
క్రాంతిని చూడగానే ముద్రగడ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కుటుంబంలో తలెత్తిన విభేదాలను ప్రస్తావిస్తూ.. ఆమెను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. క్రాంతి తన తండ్రి భౌతికకాయాన్ని చూస్తూ "నాన్నా" అంటూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరుమున్నీరైనా కుటుంబ సభ్యులు మనసు మార్చుకోలేదు. ఆమెను కనీసం మృతదేహం వద్దకు కూడా వెళ్లనివ్వలేదు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు. చివరకు తన తండ్రికి దూరం నుంచే నివాళి అర్పించి ఆమె భారమైన హృదయంతో వెనుదిరిగారు.
ఈ తండ్రీకూతుళ్ల వివాదానికి 2024 ఎన్నికల నాటి రాజకీయ భేదాభిప్రాయాలే మూలకారణం. ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరగా, ఆయన కుమార్తె క్రాంతి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో తన తండ్రి, సోదరుడి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ క్రాంతి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ వ్యాఖ్యలను ముద్రగడ తీవ్రంగా ఖండించడమే కాకుండా, రాజకీయాల కోసం తన కుటుంబాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాక, తనకు ఆ కుమార్తెతో ఎలాంటి సంబంధం లేదని అప్పట్లోనే బహిరంగంగా ప్రకటించారు. ఆ పాత పగలే ఇప్పుడు అంత్యక్రియల వేళ బయటపడ్డాయి.
ఇదిలా ఉండగా, ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చించిన అనంతరం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.




