'మురసు' తుఫాన్ బాధితులకు 'మనమిత్ర' అభయం
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. బాధితుల
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డిజిటల్ వేదిక ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) అధికారులు వెల్లడించారు.
వాట్సాప్‌లోనే ఫిర్యాదుల నమోదు , పరిష్కారం
తుఫాన్ ధాటికి విద్యుత్ సరఫరాకు విఘాతం కలిగినా, రహదారులపై చెట్లు లేదా గోడలు కూలిపోయినా, ఇళ్లలోకి వరద నీరు చేరినా ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందకుండా వాట్సాప్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు. క్షేత్రస్థాయిలోని సమస్యకు సంబంధించిన ఫొటోలను కూడా అప్‌లోడ్ చేసే వెసులుబాటు కల్పించడంతో, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వేగవంతమైన పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
'మనమిత్ర' వాట్సాప్ సేవలను వినియోగించుకునే విధానం
ఈ సేవను పొందేందుకు బాధితులు ముందుగా 9552300009 అనే వాట్సాప్ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే సేవల జాబితా నుంచి 'Murasu Cyclone Issue' అనే ఆప్షన్‌ను ఎంచుకుని, 'Report Issue' పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. అనంతరం నమోదు ఆప్షన్ ద్వారా పేరు, జిల్లా, మండలం వివరాలను తెలియజేసి, తమ ప్రాంతంలో ఉన్న సమస్యను వివరంగా రాసి అవసరమైతే ఫోటోను అప్‌లోడ్ చేస్తే ఫిర్యాదు ప్రక్రియ పూర్తవుతుంది.
అత్యవసర సహాయం కోసం ఏపీఎస్‌డీఎంఏ హెల్ప్‌లైన్ నంబర్లు
మనమిత్ర ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే స్థానిక అధికారులకు చేరవేసి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మురసు తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, తీవ్ర అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) ఏర్పాటు చేసిన 112, 1070, , 1800 425 0101 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.




