Nagababu: నాగబాబు ఇలా దొరికిపోయారేంటి..!

Nagababu: కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగబాబుపై సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది.

Gagan kumar
Published on: 4 Oct 2026 9:59 AM IST
Nagababu
X

Nagababu: నాగబాబు ఇలా దొరికిపోయారేంటి..!

Tirumala: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక అంశంతో చర్చనీయాంశంగా ఉండే మెగా కుటుంబం మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు కేంద్రబిందువైంది. జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. ఒకవైపు తిరుమల ఏర్పాట్లను ఆయన ప్రశంసించగా, మరోవైపు ఆయన గత ఇంటర్వ్యూలను బయటకు తీస్తున్న నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

నాగబాబు తన కుమారుడు, హీరో వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠి, కుమార్తె నిహారికలతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఈ కుటుంబం, తమ మనవడికి శాస్త్రోక్తంగా తలనీలాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించింది.

అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన నాగబాబు... తిరుమలలో కల్పిస్తున్న ఏర్పాట్లు, పరిశుభ్రత, క్రమశిక్షణను ఆకాశానికి ఎత్తేశారు. దేశంలో మరే ఆధ్యాత్మిక క్షేత్రంలో లేని అత్యున్నత నిర్వహణ ఇక్కడ కనిపిస్తోందని, ఇలాంటి పవిత్ర పుణ్యభూమి ఏపీలో ఉండటం తెలుగు ప్రజల పూర్వజన్మ సుకృతమని కొనియాడారు. అయితే, నాగబాబు తిరుమల యాత్ర ముగిసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ట్రోలింగ్ ఊపందుకుంది. గతంలో ఆయన నాస్తికత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడిన పాత ఇంటర్వ్యూ క్లిప్పింగ్‌లను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

గతంలో నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నాకు దేవుడిపై నమ్మకం లేదు. గతంలో విశ్వాసంతో యాగాలు, హోమాలు చేశాను. కానీ అప్పటికంటే లోతుగా ఆలోచించి, అసలు ఉనికిలోనే లేని దేవుడి కోసం ఈ ఆచారాలు చేయడం దండగని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నాస్తికత్వాన్ని ఎంచుకున్నా అని కుండబద్దలు కొట్టిన వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు ప్రస్తావిస్తున్నారు. రాజకీయ లబ్ధి, ఓట్ల కోసమే ఇప్పుడు ఈ భక్తి నాటకాలు ఆడుతున్నారంటూ నెట్టింట ఘాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విమర్శలు కేవలం నాగబాబుకే పరిమితం కాకుండా మెగా కుటుంబం మొత్తానికి చుట్టుముట్టాయి. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తండ్రి కొణిదెల వెంకట్రావు నాస్తికుడని, నాయనమ్మ భక్తితో వెలిగించిన దీపం నుంచే ఆయన సిగరెట్ వెలిగించుకునేవారని చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తమ కుటుంబంలో కమ్యూనిస్ట్ భావజాలం ఉండేదని, దేవుడిని నమ్మే సంప్రదాయం లేదని గతంలో చెప్పిన సందర్భాలను నెటిజన్లు తెరపైకి తెస్తున్నారు.

రక్తంలోనే నాస్తికత్వం ఉందని గర్వంగా చెప్పుకున్న వీరు, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, అధికార బలంతో రంగులు మారుస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వ్యక్తిగత నమ్మకాలు ఎవరివైనా కావొచ్చు కానీ, రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం ఎంతవరకు సమంజసమంటూ చర్చ నడుస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.