Nandi Awards: టాలీవుడ్‌కు పండగ లాంటి వార్త..మళ్లీ సందడి చేయనున్న నంది అవార్డులు..!

Nandi Awards: తెలుగు సినీ, టెలివిజన్ కళాకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది.

Gagan kumar
Published on: 27 Nov 2026 10:08 AM IST
Nandi Awards
X

Nandi Awards: టాలీవుడ్‌కు పండగ లాంటి వార్త..మళ్లీ సందడి చేయనున్న నంది అవార్డులు..!

AP Nandi Awards 2026: తెలుగు చలనచిత్ర, టెలివిజన్ రంగాల కళాకారులు, సాంకేతిక నిపుణుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘నంది అవార్డుల’ పునరుద్ధరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఈ పురస్కారాలను మళ్లీ అందించేందుకు అధికారికంగా చర్యలు చేపట్టింది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబర్ 2026లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. నంది అవార్డుల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 22న జీవో ఆర్‌టీ నంబర్ 1843ను జారీ చేసింది. దీని ప్రకారం అవార్డుల కేటాయింపును రెండు దశలుగా విభజించారు.

ఈ ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించి ప్రతి ఏడాదికి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, రెండో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులను అందించనున్నారు. అంటే ఒక్కో ఏడాదికి నాలుగు చొప్పున పురస్కారాలు ఉంటాయి. 2025 ఏడాదికి మాత్రం గతంలో మాదిరిగానే ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు సహా అన్ని ప్రధాన విభాగాల్లో పూర్తి స్థాయి అవార్డుల ఎంపిక చేపట్టనున్నారు. డిసెంబర్ 2026లో అమరావతి లేదా విజయవాడ వేదికగా సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు.బుల్లితెర పురస్కారాల వేడుకకు ఆధ్యాత్మిక నగరి తిరుపతి వేదిక కానుంది. సినిమా విభాగం తరహాలోనే 2017-2024 మధ్య కాలానికి ఉత్తమ మెగా సీరియల్, రెండో ఉత్తమ మెగా సీరియల్, రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఇస్తారు. 2025 సంవత్సరానికి మాత్రం అన్ని టీవీ విభాగాల్లో పూర్తి స్థాయి అవార్డులు అందజేస్తారు.

2017-2025 అవార్డులతో పాటు, అంతకుముందు పెండింగ్‌లో ఉండిపోయిన పురస్కారాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 2012 నుంచి 2016 వరకు ఇప్పటికే ప్రకటించిన నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా 2026 నవంబర్‌లో విజయవాడలో ప్రదానం చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఆయా సంవత్సరాలకు సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు.

తెలుగు సినిమా, కళాకారులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964లో నంది అవార్డులకు శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా లేపాక్షిలోని ప్రసిద్ధ నంది విగ్రహం స్ఫూర్తితో ఈ పురస్కారాలకు ఆ పేరు పెట్టారు. తొలినాళ్లలో బంగారు, వెండి, కాంస్య నందుల రూపంలో అవార్డులు అందించేవారు. ఆ తర్వాత నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులను గౌరవించే అత్యున్నత రాష్ట్ర స్థాయి పురస్కారాలుగా ఇవి చరిత్రకెక్కాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంపై తెలుగు సినీ, టెలివిజన్ రంగాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళాకారుల ప్రతిభకు మళ్లీ తగిన గుర్తింపు లభించనుండటంతో ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.