Nara Lokesh : ఏపీ టార్గెట్ నెం.1.. లోకేష్ ‘వెర్షన్ 4.0’ కామెంట్స్ వైరల్.!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సరికొత్త సంస్కరణలతో ముందుకు సాగుతున్నామని

G Krishna
Published on: 3 Oct 2026 11:39 AM IST
Nara-Lokesh
X

Nara-Lokesh

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సరికొత్త సంస్కరణలతో ముందుకు సాగుతున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన పాన్-ఐఐటీ (PanIIT) కాన్ఫరెన్స్ ప్రతినిధుల డిన్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగించిన లోకేష్, రాష్ట్ర పునర్నిర్మాణం , అభివృద్ధి వ్యూహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘చంద్రబాబు వెర్షన్ 4.0’ అత్యంత శక్తివంతం

సాంకేతిక రంగంలో ఆపరేటింగ్ సిస్టమ్‌‌లు ఒక్కో అప్‌డేట్‌తో ఎలాగైతే సరికొత్త ఫీచర్లతో మెరుగుపడతాయో, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతిసారి మరింత మెరుగవుతున్నారని లోకేష్ అభివర్ణించారు. "ఇది మన ముఖ్యమంత్రిగారి నాలుగో వెర్షన్ (Version 4.0). ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రభుత్వంలో దాదాపు 50 శాతం మంది ఎమ్మెల్యేలు తొలిసారి ఎన్నికైనవారే. అలాగే 25 మంది మంత్రుల్లో 17 మంది మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన యువకులే. ఈ రకంగా చూస్తే ఇప్పుడు నేనే ఒక సీనియర్ మంత్రిని! రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు మేమంతా తీవ్రమైన కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం" అని పేర్కొన్నారు.

10 బిలియన్ డాలర్ల అగ్రికల్చర్ మిషన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిలయన్స్ ప్రతినిధి అనంత్ అంబానీ , సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రారంభమైన 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌, హార్టికల్చర్ మిషన్' గురించి లోకేష్ ప్రస్తావించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దాదాపు 10 బిలియన్ డాలర్ల (రూ.లక్ష కోట్లు) భారీ పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఉద్యానవన రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే ఈ మిషన్ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా హార్టికల్చర్ నుంచి స్పేస్ సాంకేతికత వరకు, డ్రోన్ టెక్నాలజీ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ , డేటా సెంటర్ల వరకు ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందని వివరించారు.

10 ఏళ్లలోనే భారత్ అగ్రరాజ్యం.. లీడర్‌‌గా ఏపీ

ప్రపంచ దేశాల అభివృద్ధి వేగాన్ని విశ్లేషిస్తూ లోకేష్ ఆసక్తికరమైన పోలికలు చేశారు. "ఐరోపా, అమెరికా వంటి దేశాలు అభివృద్ధి చెందడానికి 100 నుంచి 120 ఏళ్లు పట్టింది. దుబాయ్ 30 నుంచి 35 ఏళ్లలో రూపాంతరం చెందితే, సింగపూర్ కేవలం 25 ఏళ్లలోనే అభివృద్ధి చెందిన దేశంగా మారింది. కానీ మన భారతీయుల్లో ఉన్న అపారమైన మేధోశక్తి, సాంకేతిక ప్రతిభ, బలమైన రాజకీయ నాయకత్వాన్ని చూస్తుంటే.. రాబోయే కేవలం 10 ఏళ్లలోనే (ఒక దశాబ్దంలోనే) భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం ఖాయం. ఈ మహత్తర మార్పుకు ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తూ నాయకత్వం వహిస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు. పోటీతత్వంతో కూడిన సమైక్య వ్యవస్థలో ఏపీ సృష్టించే బెంచ్‌మార్క్ మోడల్స్, రేపు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని ఐటీ మంత్రి లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.