Nara Lokesh: రష్యా పర్యటనలో లోకేష్ దూకుడు.. పెట్టుబడుల వేటలో కీలక భేటీ

Nara Lokesh: రష్యా పర్యటనలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ సంచలనం. రష్యా సంపన్న ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ 'సిస్టమా' ప్రెసిడెంట్ తాగిర్ సిట్‌డేకోవ్ తో భేటీ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 4 Jun 2026 8:48 PM IST
Nara Lokesh
X

Nara Lokesh: రష్యా పర్యటనలో లోకేష్ దూకుడు.. పెట్టుబడుల వేటలో కీలక భేటీ

Nara Lokesh: రష్యా పర్యటనలో మూడో రోజు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యాకు చెందిన ప్రముఖ బహుళజాతి పెట్టుబడి సంస్థ సిస్టమా అధ్యక్షుడు తాగి ర్ సిట్ దేకోవ్ తో సమావేశమై పలు వ్యూహాత్మక ప్రతిపాదనలు చేశారు. జలరవాణా, గ్రీన్ ఎనర్జీ, అంతరిక్ష సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ సిటీలు వంటి భవిష్యత్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం పెంచాలని కోరారు. ఎలక్ట్రిక్ రివర్ మెట్రో నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు.

*లోకేష్ ప్రతిపాదనలు*

భారత్‌లోని జాతీయ జలరవాణా మార్గాల్లో ఎలక్ట్రిక్ రివర్ మెట్రో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని మంత్రి లోకేష్ సూచించారు. ప్రధాన ఓడరేవుల్లో అసెంబ్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే ఇస్రో మౌలిక సదుపాయాల సమీపంలో చిన్న ఉపగ్రహాల తయారీ, గ్రౌండ్ స్టేషన్ కేంద్రాల ఏర్పాటుకు సంయుక్త భాగస్వామ్యం కోరారు. తీరప్రాంత భద్రత కోసం ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు, ఆటోనమస్ సీ షిప్ యార్డ్‌ల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

*క్వాంటమ్ వ్యాలీతో హైటెక్ భాగస్వామ్యానికి పిలుపు*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న "క్వాంటమ్ వ్యాలీ" ఫ్రేమ్‌వర్క్‌లో భాగస్వామ్యం కావాలని లోకేష్ ఆహ్వానించారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు, బయోమెట్రిక్ టెక్నాలజీలు, ఏఐ ఆధారిత పట్టణ పరిపాలన సాధనాల అభివృద్ధిలో సిస్టమా సంస్థ భాగస్వామ్యం వహించాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ డేటా ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటు విషయంలో కూడా సహకారం అందించాలని సూచించారు.

*ఏపీ పోర్టుల ఆధారంగా పరిశ్రమల విస్తరణకు ప్రతిపాదన*

దక్షిణ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని, సిమెంట్ మరియు వ్యవసాయ రంగాల కోసం కాగితపు ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని లోకేష్ ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ పోర్టుల ద్వారా దిగుమతి అయ్యే ముడిసరుకును వినియోగించి స్థానిక తయారీని ప్రోత్సహించవచ్చని వివరించారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక వృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

*భారత్‌లో ఇప్పటికే కార్యకలాపాలు.. సిస్టమా వెల్లడి*

సిస్టమా అధ్యక్షుడు తాగిర్ సిట్‌డేకోవ్ మాట్లాడుతూ, భారత్‌లో డిజిటల్ ఎకోసిస్టమ్, ఎస్ఎంఈ ఫైనాన్సింగ్, టెక్నాలజీ ఆధారిత సరఫరా గొలుసు రంగాల్లో తమ సంస్థ ఇప్పటికే సేవలు అందిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సిస్టమా వెంచర్ క్యాపిటల్ విభాగం ద్వారా గ్రోత్ క్యాపిటల్, మార్కెట్ విస్తరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, కన్వర్సేషనల్ ఏఐ రంగాల్లో స్టార్టప్‌లకు పెట్టుబడులు అందిస్తున్నామని వెల్లడించారు.

*లిషియస్, రెబెల్ ఫుడ్స్ వంటి సంస్థల్లో పెట్టుబడులు*

గ్రోత్ ఈక్విటీ వ్యూహంలో భాగంగా లీసియస్, రెబెల్ ఫుడ్స్, లెండింగ్కార్ట్ వంటి భారతీయ మార్కెట్‌లో ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు పెట్టామని సిస్టమా ప్రతినిధులు వివరించారు. భారత్‌లో వివిధ రంగాల్లో క్రాస్ బోర్డర్ మార్కెట్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సహకార కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు.

*ఏపీ ప్రతిపాదనలపై సానుకూల స్పందన*

మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలిస్తామని సిస్టమా అధ్యక్షుడు తాగిర్ సిట్‌డేకోవ్ హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసే అవకాశాలపై సానుకూలంగా స్పందించారు. రష్యా పర్యటనలో లోకేష్ నిర్వహిస్తున్న వరుస సమావేశాలు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక భాగస్వామ్యాలు తీసుకురావడంలో కీలకంగా మారనున్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

*సిస్టమా సంస్థ ప్రత్యేకత ఏమిటి?*

రష్యాలో టెలికం, ఈ-కామర్స్, టింబర్, హెల్త్‌కేర్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిస్టమా దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థల్లో ఒకటి. 80 మిలియన్లకు పైగా టెలికాం వినియోగదారులకు సేవలు అందిస్తుండగా, లక్షలాది మంది డిజిటల్ సేవలను వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక, పెట్టుబడి రంగాల్లో ప్రభావవంతమైన సంస్థగా సిస్టమా గుర్తింపు పొందింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story