Vande Bharat: శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Vande Bharat: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు కేంద్ర రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది.

CR Reddy
Published on: 6 Sept 2026 7:39 AM IST
Vande Bharat
X

Vande Bharat

Vande Bharat: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు కేంద్ర రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ నుంచి తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే బోర్డు సన్నాహాలు పూర్తి చేస్తోంది. తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటికే తిరుపతి మీదుగా పలు వందే భారత్ రైళ్లు నడుస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందిస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలోని ప్రముఖ నగరం శివమొగ్గ నుంచి తిరుపతికి ప్రత్యక్ష వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే రెండు పొరుగు రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.

ఎంపీ చొరవతో రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్

శివమొగ్గ టౌన్ - తిరుపతి మధ్య కొత్త వందే భారత్ రైలును కేటాయించాలని తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి గతంలో రైల్వే బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ ప్రతిపాదనలను వేగవంతం చేసినట్లు ఎంపీ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తిరుపతి స్టేషన్‌లో జరిగిన ట్రయల్ రన్ కూడా ఈ కొత్త రైలు కోసమేనని స్పష్టమవడంతో స్థానిక ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపార, విద్యారంగాలకు కొండంత అండ

ఈ కొత్త రైలు ప్రారంభమైతే కేవలం ఆధ్యాత్మిక యాత్రలకే కాకుండా ఇరు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, వైద్య సేవలు, విద్యా అవసరాల కోసం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకునేలా సౌకర్యవంతమైన సీటింగ్, ప్రపంచ స్థాయి వసతులతో ఈ రైలు అందుబాటులోకి రానుంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు

ఈ వార్తతో పాటు మరో శుభవార్త కూడా ఏపీ ప్రజలను పలకరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ తుది ఏర్పాట్లు చేస్తోంది. విశాఖపట్నం నుంచి ఐటి రాజధాని బెంగళూరు మధ్య ఈ రాత్రివేళ స్లీపర్ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దూరప్రాంత ప్రయాణికులకు పడక సదుపాయంతో కూడిన ఈ అత్యధునిక స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత హాయిగా మారనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story