Appanapalli: అప్పనపల్లిలో రూ.3 కోట్లతో ఆధునిక భోజనశాల.. ఎమ్మెల్యే శంకుస్థాపన!
Appanapalli: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానంలో భక్తుల వసతుల కల్పనకు ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది.
Appanapalli: అప్పనపల్లిలో రూ.3 కోట్లతో ఆధునిక భోజనశాల.. ఎమ్మెల్యే శంకుస్థాపన!
అప్పనపల్లి (మామిడికుదురు మండలం): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, అప్పనపల్లి గ్రామంలోని శ్రీ బాల బాలాజీ దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం పుష్కరాల నిధులలో భాగంగా రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక భోజనశాల మరియు కిషన్ హాల్ నిర్మాణ పనులకు పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానం రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిందని, ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారని తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పుష్కరాల నిధుల ద్వారా రూ.3 కోట్ల వ్యయంతో విశాలమైన భోజనశాల, కిషన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు.
ఈ నిర్మాణాలు పూర్తయిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు మరింత సక్రమంగా నిర్వహించడంతో పాటు, ఆలయానికి విచ్చేసే భక్తులకు విశ్రాంతి, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు, పార్టీ నాయకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




