Fire Accident : పరవాడ ఫార్మాసిటీలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి.!
Fire Accident : విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడి ఫార్మాసిటీ పరిధిలో ఉన్న 'దక్షిణ్ ఎనర్జీ'..
Fire Accident
Fire Accident : విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడి ఫార్మాసిటీ పరిధిలో ఉన్న 'దక్షిణ్ ఎనర్జీ' అనే ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ లోపల కెమికల్స్, ఆయిల్స్ ఉండటంతో మంటలు చాలా వేగంగా ఇండస్ట్రీ అంతా వ్యాపించాయి. ఈ ఊహించని ప్రమాదంతో కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
లోపలే చిక్కుకుపోయిన కార్మికులు
మంటలు ఫ్యాక్టరీని చుట్టుముట్టేయడంతో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దట్టమైన పొగ, మంటలు అలుముకోవడంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అందుకూ, ఈ దారుణ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. మరికొంతమంది గాయపడినట్లు తెలుస్తుండగా, వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది, పోలీసులు
ఫ్యాక్టరీలో మంటలు చెలరేగిన విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యారు. పలు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగి ఫ్యాక్టరీ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపల చిక్కుకున్న మిగతా సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి స్థానికులతో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం, పైగా ఇద్దరు కార్మికులు చనిపోవడంతో ఫార్మాసిటీ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. అస్సలు ఈ మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగాయా, లేక ఆయిల్ తయారీ ప్రాసెస్‌లో ఏదైనా పొరపాటు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి నష్టతీవ్రత ఎంత ఉంది, లోపల ఇంకెవరైనా ఉన్నారా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




