Pawan Kalyan: వైసీపీ పంచాయతీలకూ నిధులు.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన!
Pawan Kalyan: రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని రాజకీయాల రంగుల్లేకుండా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి..
Pawan Kalyan: వైసీపీ పంచాయతీలకూ నిధులు.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన!
Pawan Kalyan: రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని రాజకీయాల రంగుల్లేకుండా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని కాకవాడ గ్రామంలో ఆయన "అడవితల్లి బాట 2.0" కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రూ.2,052 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 2,569 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని 1,341 గిరిజన ఆవాసాలకు గాను 1,976 కిలోమీటర్ల మేర బీటీ రహదారులు, 45 ప్రధాన వంతెనలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసింది..
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకులు గిరిజన గ్రామాల అభివృద్ధిని పూర్తిగా పక్కనబెట్టి, వందల కోట్ల ప్రజాధనాన్ని పార్టీ రంగులు వేయడానికి, మళ్లీ వాటిని తుడవడానికే దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
ఆ నిధులతో ఏజెన్సీలో ఎన్నో నాణ్యమైన రోడ్లు నిర్మించే అవకాశముండేదని వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాల్లో కొండలు తొలచి, రాక్ కటింగ్ చేయడం వంటి ఎన్నో సవాళ్లతో కూడిన రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. కాంట్రాక్టర్లు కట్టే రోడ్ల నాణ్యతను స్థానిక ప్రజలే స్వయంగా పర్యవేక్షించి, లోపాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
వైసీపీ మద్దతుదారులకూ సమాన నిధులు..
వైసీపీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అభివృద్ధిని రాజకీయ కోణంలో చూడదని పవన్ తెలిపారు. ఏ ఒక్క పార్టీనో బతికించడం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలు బతకాలని, గ్రామాలు బాగుపడి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ఆకాంక్షించారు. తాము పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైసీపీ మద్దతు ఉన్న సర్పంచ్‌లు, పంచాయతీలకు కూడా ఎలాంటి వివక్ష లేకుండా అవసరమైన నిధులను విడుదల చేశామని గుర్తుచేశారు. గిరిజనుల ఆర్థిక పురోగతి కోసం ఉద్యానవనాలు, టూరిజం, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని.. అటవీ అనుమతులను వేగవంతం చేసి సెల్ టవర్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో జనసైనికులకు సముచిత స్థానం ఉండాలి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసైనికులు చేసిన పోరాటం, త్యాగాలు వెలకట్టలేనివన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన కష్టకాలంలో కూడా రోడ్లపైకి వచ్చి ధైర్యంగా నిలబడిన జనసైనికులు, వీరమహిళల సేవలను మరువలేమని పేర్కొన్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో పొత్తు ధర్మానికి కట్టుబడి, కూటమి తరఫున జనసేన కార్యకర్తలకు తగిన స్థానం బోయింగ్ సముచిత ప్రాతినిధ్యం లభించేలా నాయకులు చూడాలని విజ్ఞప్తి చేశారు. అహంకారంతో బెదిరించే రోజులు పోయాయని, పౌరులు బాధ్యతాయుతంగా తప్పులను ప్రశ్నించాలని సూచించారు.




