Sai Krishna Missing Case: విజయవాడ సీపీపై తల్లి సంచలన ఆరోపణలు!
Sai Krishna Missing Case: విజయవాడలో తీవ్ర సంచలనం రేపిన సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీబీఐ (CBI) విచారణ జరిపించాలని కోరుతూ ఆయన తల్లి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Sai Krishna Missing Case: విజయవాడ సీపీపై తల్లి సంచలన ఆరోపణలు!
Sai Krishna Missing Case: విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే కేవలం సీబీఐ (CBI) విచారణతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేస్తూ.. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తును స్వయంగా హైకోర్టు పర్యవేక్షించాలని ఆమె తన అభ్యర్థనలో కోరారు.
తాము దాఖలు చేసిన పిటిషన్‌లో విజయలక్ష్మి విజయవాడ పోలీస్ కమిషనర్ (CP) మరియు ఇతర పోలీస్ ఉన్నతాధికారుల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తన కుమారుడి అదృశ్యం వెనుక పోలీసుల పెద్ద హస్తం ఉందంటూ ఆమె పేర్కొన్నారు.
"నా కుమారుడు సాయి కృష్ణ అదృశ్యం గురించి విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ముందే తెలుసు. సాయి కృష్ణ లేడనే నిజం తెలిసినప్పటికీ.. సీపీ గత 40 రోజులుగా కావాలనే మౌనంగా ఉన్నారు."
"నేను నా కుమారుడి గురించి ఫిర్యాదు చేసిన 45 రోజుల తర్వాత గానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీన్ని బట్టే ఈ అదృశ్యం వ్యవహారంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఎంతలా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది."
"ఈ కేసులో సీఐ నాగరాజు అరెస్టు అనేది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పోలీసుల కుట్రలను పూర్తిగా చేధించడం లేదు."
పోలీస్ శాఖ అంతా కలిసి ఈ కేసును శాశ్వతంగా వెలుగులోకి రానివ్వకుండా అణిచివేయాలని చూస్తోందని విజయలక్ష్మి ఆరోపించారు.
"మేము హైకోర్టులో దాఖలు చేసిన 'హెబియస్ కార్పస్' పిటిషన్‌ను ఎలాగైనా క్లోజ్ చేయించాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాము ఏదో నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టును నమ్మించేందుకు నాటకాలు ఆడుతున్నారు. ఈ కేసులో అసలైన దోషులను శాశ్వతంగా తప్పించడమే పోలీసుల ముఖ్య ఉద్దేశం. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో గౌరవ హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలి."
సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన ఈ సంచలన పిటిషన్‌ను హైకోర్టు వచ్చే సోమవారం నాడు విచారణకు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఆరోపణలతో విజయవాడ పోలీస్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.




