5 రాష్ట్రాలు, ఒకే వారసత్వం.. విజయవాడలో హిందూ దేవాలయ కళల మహోత్సవం 'సప్త సింధు'..!

Sapta Sindhu 2026: మన సనాతన దేవాలయ నిర్మాణ వైభవాన్ని పునరుజ్జీవింపజేసేందుకు సప్త సింధు చేపట్టిన ఈ ప్రయోగం ప్రాచీన జ్ఞానానికి, ఆధునిక ఆలోచనలకు వారధిగా నిలుస్తోంది.

Venkat
Published on: 31 July 2026 8:06 PM IST
Sapta Sindhu 2026
X

5 రాష్ట్రాలు, ఒకే వారసత్వం.. విజయవాడలో హిందూ దేవాలయ కళల మహోత్సవం 'సప్త సింధు'..!

Sapta Sindhu 2026: పురాతన భారతీయ ఆలయ శిల్పకళ, సనాతన సాంప్రదాయాల పునరుజ్జీవనానికి విజయవాడ ఓ గొప్ప వేదికగా మారింది. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల కళాకారులు, యువ ప్రతిభావంతులు ఒకే వేదికపైకి వచ్చి మన సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ 'సప్త సింధు 2026' అమరావతి ఎడిషన్‌లో అడుగుపెట్టనున్నారు.

ఆలయ శిల్పకళకు పూర్వవైభవం అందించే మహా యజ్ఞం..

భారతీయ ఆలయ శిల్పకళ కేవలం రాతి నిర్మాణం మాత్రమే కాదు, అది మన ధర్మం, సాంప్రదాయం, శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. ఈ అద్భుతమైన సాంప్రదాయ వైభవాన్ని భావితరాలకు అందిస్తూ, ఆధునిక సృజనాత్మకతను జోడించేందుకు 'సప్త సింధు 2026' ప్రతిష్టాత్మక వేదికను సిద్ధం చేసింది. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPAV) ఆవరణలో ఆగస్టు 1, 2 తేదీలలో ఈ ఐతిహాసిక వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.

కేంద్ర సంస్కృతి మంత్రిత్వ శాఖ, ఏఈ ఫౌండేషన్, విశ్వబంధు ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో దక్షిణ భారతానికి చెందిన ప్రతిభావంతులు పాల్గొంటున్నారు. ఆలయ నమూనాల రూపకల్పన, మురళ్ ఆర్ట్, పల్లకి తయారీ, రంగవల్లులు, దేవాలయ తోరణాల అలంకరణ వంటి 5 ప్రత్యేక విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.

దిగ్గజ నిపుణుల మార్గదర్శకత్వం..

ఈ సాంస్కృతిక సమరంలో విజేతలను నిర్ణయించేందుకు దేశంలోనే అత్యున్నత ఆలయ శిల్పకళా నిపుణులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తుండటం విశేషం. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమతా మూర్తి చీఫ్ స్థపతి డి.ఎన్.వి. ప్రసాద్ స్థపతి, యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (YTDA) సలహాదారు డాక్టర్ ఎస్. సుందరరాజన్ స్థపతి, ప్రముఖ ఆలయ ఆర్కిటెక్ట్, టిటిడి బోర్డు మెంబర్ ఆనంద్ సాయి, మంథా అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ మంథా, ఎస్పీఏవి ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక సదస్సులు..

ఆగస్టు 1న జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో నిపుణులచే ప్రత్యేక సాంకేతిక సదస్సులు ఉంటాయి. ప్రొఫెసర్ డాక్టర్ వెంకట కృష్ణ కుమార్ సాధు, సురేంద్రనాథ్ బొప్పరాజు సమకాలీన ఆలయ నిర్మాణ శైలులపై అవగాహన కల్పిస్తారు. పాల్గొనే ప్రతినిధులు, పోటీదారుల కోసం సాయంత్రం వేళ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శన ఏర్పాట్లు కూడా చేశారు.

రెండో రోజు ఉదయం డాక్టర్ ఎస్. సుందరరాజన్, ఆనంద్ సాయి సాంకేతిక ప్రసంగాలు ఉంటాయి. అనంతరం ప్రజల వీక్షణార్థం బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

మన సనాతన దేవాలయ నిర్మాణ వైభవాన్ని పునరుజ్జీవింపజేసేందుకు సప్త సింధు చేపట్టిన ఈ ప్రయోగం ప్రాచీన జ్ఞానానికి, ఆధునిక ఆలోచనలకు వారధిగా నిలుస్తోంది. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ అరుదైన దృశ్యకావ్యం విశేషంగా ఆకట్టుకుంటుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story