Weather Update : భగభగమంటున్న భానుడు.. రాయలసీమలో 45.1 డిగ్రీల రికార్డు.. వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి

Weather Update : ఏపీ, తెలంగాణలో భానుడు వీరతాండవం చేస్తున్నాడు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటింది. రాబోయే మే, జూన్ నెలల్లో ఎండలు మరింత తీవ్రం కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

CR Reddy
Published on: 17 April 2026 7:15 AM IST
Weather Update
X

Weather Update 

Weather Update : భానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఎండలు ముదురుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును తాకగా, రాబోయే మే, జూన్ నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అసాధారణ వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా ఉండటమే కాకుండా, రికార్డు స్థాయి వేడి నమోదయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అసాధారణంగా ఉంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం, పలు విదేశీ వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును సులువుగా దాటిపోనున్నాయి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల చల్లని తూర్పు గాలులు బలహీనపడ్డాయి. దీనికి తోడు ఉత్తరాది నుంచి వీస్తున్న పొడి వేడి గాలులు దక్షిణాదిని ఉడికించి వేస్తున్నాయి.

రాయలసీమలో రికార్డు స్థాయి వేడి

గడిచిన 24 గంటల్లో రాయలసీమ ప్రాంతం నిప్పుల కొలిమిని తలపించింది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 215 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ వేడి రికార్డయ్యింది. కోస్తా తీర ప్రాంతాల్లో కూడా ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. వాతావరణం అనిశ్చితిగా ఉండటం వల్ల కొన్ని చోట్ల మేఘాలు ఆవరించినప్పటికీ, అవి వేడిని తగ్గించలేకపోతున్నాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నేడు, రేపు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎల్‌నినో ముందస్తు ప్రభావం

వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రంలో లానినా బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఎల్‌నినో ముందస్తు వాతావరణానికి సంకేతం. దీనివల్ల సాధారణం కంటే ఎక్కువ వేడి ఉండటమే కాకుండా, వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో అర్బన్ హీట్ ఐలాండ్స్ ప్రభావం వల్ల రాత్రిపూట కూడా వేడి తగ్గడం లేదు. దీనివల్ల ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా వ్యవసాయ పంటల దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముందున్నది ముసళ్ల పండుగ

ఏప్రిల్ మూడో వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే, అసలైన కత్తెర కార్తె (రోహిణి కార్తె) వచ్చే మే నెలలో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయోనని జనం వణికిపోతున్నారు. శుక్రవారం నాడు మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తోంది. అకాల వర్షాలు పడితే తప్ప ఈ వేడి నుంచి ఉపశమనం లభించడం కష్టమని స్పష్టమవుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story