NTR: సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.? ఆయనకు ఏ ఫుడ్ ఇష్టమో తెలుసా..
NTR: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. ఆయన ఆహారపు అలవాట్లు, దినచర్య ఎలా ఉండేవో తెలుసుకుందాం.
NTR: సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.? ఆయనకు ఏ ఫుడ్ ఇష్టమో తెలుసా..
ఎన్టీఆర్ భోజనపు అలవాట్లు ఎప్పుడూ ఒకేలా ఉండేవి కావు. అవి ఆయన వేసే పాత్రల మీద పూర్తిగా ఆధారపడి ఉండేవి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లేదా వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడి పాత్రలు చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఎంతో భక్తి శ్రద్ధలతో, కఠినమైన నిష్టతో ఉండేవారు. ఆ సమయంలో ఆయన కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటూ, మంచం మీద కాకుండా కింద కటిక నేలపైనే పడుకునేవారట. అదే రావణాసురుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణిక రౌద్ర పాత్రలు చేసేటప్పుడు మాత్రం ఆయన డైట్ పూర్తిగా మారిపోయేది. ఆ పాత్రల గాంభీర్యం కోసం దాదాపు ఐదారుగురు తినేంత భారీ భోజనం ఆయన ఒక్కరే అవలీలగా లాగించేసేవారు. పొద్దున్నే ఒక నాటుకోడి, ఆ తర్వాత ఒక బిందెడు పాలు తాగేవారు. నాటుకోడి చికెన్ అంటే ఎన్టీఆర్‌కి ప్రాణం. అలాగే సాయంత్రం వేళ చర్మం, ముళ్లు పూర్తిగా తీసేసి, సెనగపిండిలో వేసి నూనెలో వేయించిన ఒక కిలో బరువుండే చేపను వేడివేడిగా ఒక్కరే ఇష్టంగా తినేసేవారట. స్వీట్స్ విషయానికొస్తే సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దగ్గర దొరికే రసమలై అంటే ఆయనకు చాలా ఇష్టం.
ఇక మధ్యాహ్నం భోజనంలో మాత్రం అన్నం చాలా తక్కువగా తీసుకుని, కూరలు ఎక్కువగా తినేవారు. రెండు పాపడాలు, ఆలుగడ్డ కూర, వంకాయ వేపుడు, ఆవకాయ పచ్చడి, ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి దట్టించిన పాలకూర ఆయనకు ఎంతో ఇష్టమైన వంటకాలు. ఇక ఆయన దినచర్య కూడా ఎంతో కఠినమైన క్రమశిక్షణతో కూడుకున్నది. ప్రతిరోజూ ఉదయం సరిగ్గా 3 గంటలకే నిద్రలేచి కఠినమైన వ్యాయామం చేసేవారు. మళ్లీ రాత్రి 8 గంటలకల్లా పడుకునేవారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు టేప్ రికార్డర్‌లో శివ స్తుతి, వెంకటేశ్వర సుప్రభాతం వినడం, అలాగే రామాయణ, మహాభారతాలు చదవడం ఆయనకు ఎంతో ఇష్టం.
ఒక వైపు వృత్తి పట్ల అంకితభావం, మరోవైపు పాత్రకు తగ్గట్టుగా తనను తాను పూర్తిగా మార్చుకునే గొప్ప లక్షణం.. ఇవే ఎన్టీఆర్‌ను తెలుగు వారి ఆరాధ్య దైవంగా మార్చాయి. ఆయన అద్భుతమైన జీవనశైలి ఇప్పటి తరం నటీనటులకే కాదు, సామాన్యులైన మనందరికీ నిజంగా ఒక గొప్ప పాఠం. అటు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.




