Sri City Boiler Blast : శ్రీసిటీలో భారీ పేలుడు.. బాయిలర్ బ్లాస్ట్‌లో ఇద్దరు మృతి.!
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రతిష్టాత్మక శ్రీసిటీ పారిశ్రామికవాడలో ఘోర ప్రమాదం సంభవించింది. స్థానిక ‘టిల్ హెల్త్‌కేర్’..
Sri City TIL Healthcare Boiler Blast
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రతిష్టాత్మక శ్రీసిటీ పారిశ్రామికవాడలో ఘోర ప్రమాదం సంభవించింది. స్థానిక ‘టిల్ హెల్త్‌కేర్’ (TIL Healthcare) ప్రైవేట్ పరిశ్రమలో అకస్మాత్తుగా బాయిలర్ పేలిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. నైట్ షిఫ్ట్‌లో కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ ఒక్కసారిగా అత్యంత శక్తివంతంగా పేలిపోవడంతో ఆ ధాటికి అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
నైట్ షిఫ్ట్‌లో పేలిన బాయిలర్.. నింగికెగసిన పొగలు
రాత్రి సమయంలో ఫ్యాక్టరీలో పనులు యథావిధిగా సాగుతుండగా ఈ విపత్తు సంభవించింది. బాయిలర్ విభాగంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమ ప్రాంగణమంతా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పేలుడు ధాటికి కార్మికులు చెల్లాచెదురుగా పడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది , అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన పరిశ్రమ వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన ఇతర కార్మికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ప్రమాదానికి కారణాలపై విచారణ ముమ్మరం
పరిశ్రమలో బాయిలర్ పేలుడుకు దారితీసిన సాంకేతిక లోపాలు లేదా నిర్వహణ లోపాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భద్రతా ప్రమాణాలు సరిగా పాటించారా లేదా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్, పరిశ్రమల తనిఖీ అధికారులు ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.
మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధితులకు అండగా ఉంటామని హామీ
శ్రీసిటీలోని ప్రైవేట్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటనపై రాష్ట్ర నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి అమాయకులైన కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం పట్ల ఆయన తీవ్ర ఆవేదన చెందారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంఘటన వివరాలపై స్థానిక అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్, గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, తగిన పరిహారం , సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.




