AP Local Body Elections 2026: పదవి కోసం అర్జెంట్ పెళ్లి! బీసీ మహిళకు ఛైర్పర్సన్ పీఠం రాగానే ప్రేమించిన పిల్లకి తాళి కట్టిన యువనేత!
AP Local Body Elections 2026: సాలూరులో మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో, తన భార్యను బరిలో నిలిపేందుకు ఒక్కరోజులోనే పెళ్లిపీటలెక్కిన తెదేపా నేత వైకుంఠపు హర్షవర్ధన్.
AP Local Body Elections 2026: పదవి కోసం అర్జెంట్ పెళ్లి! బీసీ మహిళకు ఛైర్పర్సన్ పీఠం రాగానే ప్రేమించిన పిల్లకి తాళి కట్టిన యువనేత!
AP Local Body Elections 2026: రాజకీయాల్లో పదవులు దక్కించుకోవడానికి నాయకులు రకరకాల వ్యూహాలు రచిస్తుంటారు. కానీ, ఓ యువ నేత ఏకంగా ఛైర్పర్సన్ పదవిని దక్కించుకునేందుకు ఒక్క రోజులోనే అత్యవసరంగా పెళ్లి పీటలెక్కిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
సాలూరు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘బీసీ మహిళ’కు కేటాయిస్తూ సోమవారం ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది.
సాలూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ స్వయంగా మున్సిపల్ ఛైర్మన్ పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే రిజర్వేషన్ ‘మహిళా కోటా’కు వెళ్లడంతో ఆయనకు సొంతంగా పోటీ చేసే అవకాశం తప్పిపోయింది.
ఎలాగైనా తన కుటుంబానికి ఆ పదవి దక్కాలనే ఉద్దేశంతో, మహిళల కోటాలో తన ప్రియురాలినే భార్యగా అప్పటికప్పుడు వివాహం చేసుకుని బరిలో నిలపాలని హర్షవర్ధన్ నిర్ణయించుకున్నారు.
వెంటనే ఇంట్లోని పెద్దలను ఒప్పించిన హర్షవర్ధన్.. తాను ప్రేమించిన మంజీరను మంగళవారం స్థానిక ఆలయంలో అత్యంత త్వరగా వివాహం చేసుకున్నారు.
ఈసారి మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుండటంతో, తన భార్యను ఎన్నికల బరిలో నిలిపి పార్టీ టికెట్ దక్కించుకునేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాకాంక్షల కోసం ఒక్కరోజూ ఆగకుండా అర్జెంటుగా పెళ్లి చేసుకోవడంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.




