TDP Rajya Sabha : ఆ మూడో సీటు ఎవరికి? వర్ల రామయ్య వర్సెస్ చింతకాయల విజయ్ మధ్య గట్టి పోటీ!

TDP Rajya Sabha : టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను సీఎం చంద్రబాబు కొలిక్కి తెచ్చారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ పేర్లు ఖరారు కాగా, మూడో సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

CR Reddy
Published on: 6 Jun 2026 7:18 AM IST
TDP Rajya Sabha
X

TDP Rajya Sabha

TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ అభ్యర్థుల అధికారిక జాబితాను శనివారం నాడు ప్రకటించనున్నారు. మొత్తం నాలుగు స్థానాల్లో కూటమి ఒప్పందం ప్రకారం మూడు స్థానాలను టీడీపీ, ఒక స్థానాన్ని జనసేన పార్టీ తీసుకోగా.. టీడీపీకి దక్కిన మూడు సీట్లలో రెండింటికి అభ్యర్థులు ఖరారయ్యారు.

భాష్యం రామకృష్ణకు దక్కిన లక్కీ ఛాన్స్

ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు ముందే డిసైడ్ అయ్యారు. గత 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయన గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. కానీ అప్పటి రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు సీటు దక్కలేదు. ఆ సమయంలోనే రామకృష్ణకు చంద్రబాబు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు.. భవిష్యత్తులో వచ్చే మొదటి రాజ్యసభ సీటు ఆయనకే ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచినందుకు రామకృష్ణకు చంద్రబాబు ఈ పెద్దల సభ అవకాశం కల్పించారు.

సానా సతీష్‌కే మళ్లీ కొనసాగింపు

ఇక రెండో స్థానానికి సానా సతీష్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. గత ఏడాది (2024) డిసెంబర్ 13న జరిగిన ఉప ఎన్నిక ద్వారా సానా సతీష్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఆయన పదవీకాలం ఈ నెల 21వ తేదీతోనే ముగిసిపోనుంది. కేవలం ఏడాదిన్నర కాలం మాత్రమే ఆయన ఎంపీగా కొనసాగినందున, ఆయన సేవలను గుర్తించి మరోసారి పూర్తి కాలానికి రాజ్యసభకు పంపాలని చంద్రబాబు భావించారు. దీనితో ఆయన పేరు కూడా దాదాపు ఖాయమైపోయింది.

మూడో సీటుపై ఎస్సీ, బీసీల మధ్య తీవ్ర ఉత్కంఠ

ఇక ఉత్కంఠ రేపుతున్న మూడో రాజ్యసభ స్థానం కోసం చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ స్థానాన్ని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రేసులో ఇద్దరు ప్రముఖుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య, అలాగే బీసీ సామాజికవర్గం నుంచి చింతకాయల విజయ్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. శనివారం ఉదయానికల్లా ఈ మూడో సీటుపై పూర్తి స్పష్టత రానుంది.

వర్ల రామయ్య వైపే చంద్రబాబు సానుకూలత?

2019 లో టీడీపీ ఓడిపోయిన తర్వాత చాలా మంది కీలక నేతలు సైలెంట్ అయినా, వర్ల రామయ్య మాత్రం పార్టీ తరఫున గట్టిగా గళం వినిపించారు. గత 2014-19 మధ్యలోనే ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందనుకున్నా.. చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు అవకాశం దక్కింది. ఆ సమయంలో రామయ్యకు అన్యాయం జరిగిందనే సానుభూతి పార్టీలో ఉంది. ప్రస్తుతం ఆయన కుమారుడు వర్ల కుమార్ రాజా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే వర్ల రామయ్యకే లక్కీ ఛాన్స్ దక్కేలా ఉంది.

బీసీ కోటాలో రేసులో ఉన్న చింతకాయల విజయ్

ఒకవేళ మూడో సీటును బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని చంద్రబాబు డిసైడ్ అయితే మాత్రం చింతకాయల విజయ్ పేరు ముందంజలో ఉంటుంది. విజయ్ తండ్రి, సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అయ్యన్నపాత్రుడు క్రియాశీల రాజకీయాల్లో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నందున.. తన కుమారుడు విజయ్‌కు ఈసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబును గట్టిగా కోరుతున్నారు. మరి శనివారం విడుదలయ్యే ఫైనల్ లిస్టులో ఆ మూడో లక్కీ పర్సన్ ఎవరో తేలిపోనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story