టెకీ రాధాగాయత్రి మృతి కేసులో కీలక మలుపు.. భర్త, అత్తమామలకు ఉత్తరాఖండ్ పోలీసుల సమన్లు!
విజయనగరం జిల్లాకు చెందిన టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు కీలక అడుగు వేశారు.
టెకీ రాధాగాయత్రి మృతి కేసులో కీలక మలుపు.. భర్త, అత్తమామలకు ఉత్తరాఖండ్ పోలీసుల సమన్లు!
విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (టెకీ) రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రాధాగాయత్రి భర్త శ్రీచరణ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు (అత్తమామలు) దుర్గాప్రసాద్, సీతామహాలక్ష్మిలకు పోలీసులు అధికారికంగా సమన్లు జారీ చేశారు.
ఈ విచారణకు సంబంధించి ఉత్తరాఖండ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం. ఈ కేసును ఎఫ్‌ఐఆర్ నంబర్ 19/26గా నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 103 (హత్య/అనుమానాస్పద మృతి కింద) ప్రకారం కేసును విచారిస్తున్నారు. రాధాగాయత్రి భర్త శ్రీచరణ్ ప్రస్తుతం పుణెలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పనిచేస్తున్న పుణె కార్యాలయానికే నేరుగా ఈ పోలీసు నోటీసులను పంపినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసుపై సమాంతరంగా విచారణ కొనసాగిస్తున్న మసూరీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (SDM) రాహుల్ ఆనంద్ ఒక అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఘోర ఘటనకు సంబంధించి ఎవరికైనా ఏమైనా వివరాలు తెలిసి ఉంటే లేదా ఏదైనా చెప్పాలనుకుంటే, వారు నేరుగా వచ్చి మౌఖికంగా (ఓరల్) గానీ లేదా రాతపూర్వకంగా (రిటన్) గానీ తమకు తెలపవచ్చని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారు లేదా సమాచారం ఉన్నవారు ఈనెల 17వ తేదీ లోపు తమ వాంగ్మూలాలను ఖచ్చితంగా సమర్పించాలని రాహుల్ ఆనంద్ స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ టెకీ మృతి కేసులో పోలీసుల సమన్లు మరియు మేజిస్ట్రేట్ రంగంలోకి దిగడంతో విచారణ మరింత వేగవంతం కానుంది.




