Weather Update: వాయుగుండాలు, ఈదురుగాలుల బీభత్సం..రేపటి నుంచి ఏపీ, తెలంగాణలో జోరువానలు
Weather Update: తెలంగాణలోనూ, ఉత్తరాంధ్ర తీరంలోనూ తేమ 85 శాతానికి చేరగా, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 60 నుంచి 75 శాతంగా నమోదు అవుతోంది.
Weather Update
Weather Update: బంగాళాఖాతంపై ఏర్పడిన ద్రోణి, నైరుతీ రుతుపవనాల్లో పెరిగిన తేమ కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 6 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం
వాతావరణంలో తేమ శాతం గణనీయంగా పెరిగింది. తెలంగాణలోనూ, ఉత్తరాంధ్ర తీరంలోనూ తేమ 85 శాతానికి చేరగా, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 60 నుంచి 75 శాతంగా నమోదు అవుతోంది. దీని ప్రభావంతో మంగళవారం (ఆగస్టు 25) ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సూర్యకాంతి మధ్యలోనే హఠాత్తుగా కుండపోత వర్షాలు పడే వీలుంది. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు. రాయలసీమలో మాత్రం నేటి రాత్రి నుంచి వర్షాలు పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
బంగాళాఖాతంలో ఆవర్తనం.. మత్స్యకారులకు హెచ్చరికలు
జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడినప్పటికీ, బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు బలమైన ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయి. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆగస్టు 25 నుంచి 28 వరకు మత్స్యకారులు బంగాళాఖాతం మధ్య, దక్షిణ ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తీరప్రాంత బీచ్‌లకు వెళ్లే పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పసిఫిక్‌లో 5 తుపాన్ల విధ్వంసం
భారతీయ వాతావరణాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ వాతావరణ సమతుల్యతను పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 5 తుపాన్లు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వీటిలో 'సాడెల్' తుపాను గంటకు 165 కిలోమీటర్ల వేగంతో వీస్తూ చైనా, జపాన్ వైపు దూసుకెళ్తోంది. ఉత్తర అమెరికా వైపు 'ఇసెల్లే' తుపాను గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. వీటితో పాటు లాలా, 10E, నర్రా తుపాన్లు, అట్సానీ వాయుగుండం పసిఫిక్ సముద్రంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
తెలుగు జిల్లాలపై ఎల్ నినో మార్కు
ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో తీవ్రత పెరగడం వాతావరణంలో తీవ్ర అస్థిరతకు దారితీస్తోంది. అంటార్కిటికాలో మంచు వేగంగా కరిగిపోవడం వల్ల ఆసియా ఖండంపై మేఘాల దట్టం పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తుతుండగా, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవక లోటు కనిపిస్తోంది. ఆకాశం నిండా మేఘాలు ఉన్నప్పటికీ వర్షాలు కురవకపోవడానికి ఈ వాతావరణ అస్థిరతే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 26 నుంచి రెండు రాష్ట్రాల్లో వర్ష తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఉరుములు ఈదురుగాలుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండటం మంచిది. పొలాల్లో పనులు చేసుకునే రైతన్నలకు నేడు కురిసే తేలికపాటి వర్షాలు ఊరటనిస్తాయి.




